మెదక్ అర్బన్, సెప్టెంబర్10: వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందడం, గాయపడడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ తనదైనశైలిలో ప్రయత్నిస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వాహనదారులకు కళ్లెం వేసేందుకు అధునాతన ఆటోమేటిక్ కెమెరాలను మెదక్ పట్టణంలో ని ప్రధాన కూడళ్లలో ప్రారంభించారు. దీంతో పోలీసులు ప్రధాన కూడళ్లలో వాహనాదారులను ఆపి ఫైన్ వేయాల్సిన పని లేదు. రూల్స్ బ్రెక్ చేసి నడిపే వాహనాలపై ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాల ద్వారా, నిబంధనలు పాటించని వాహనదారులకు ఆటోమేటిక్‌గా కెమెరాలు జరిమానాలు విధిస్తాయి.
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఈ అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద, చమన్, అంబేద్కర్ స్టాచ్యూ సర్కిల్ వద్ద, బోధన్ చౌరస్తా లాంటి ప్రధాన కూడళ్లలో పోలీసు శాఖ ఆధ్వర్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనదారులు నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాలతో వాటిపై ఆటోమెటిక్‌గా జరిమానా జనరేట్ అయ్యేలా సాఫ్ట్వేరును రూపొందించారు. దీంతో వాహనాదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. ఉల్లఘించిన వాహనదారులకు ఆటోమేటిక్‌గా ఫైన్ జనరేట్ అవుతుంది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.100, ట్రిపుల్ డ్రైవింగ్ రూ.1200, సెల్‌ఫోన్ డ్రైవింగ్ రూ.1000 ఆటోమేటిక్‌గా ఫైన్ జనరేట్ అవుతుంది. ఫైన్ వివరాలు సంబంధిత వాహనదారుడి మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది.
ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలతో నిబంధనలు ఉల్లఘించిన వాహనదారుల సెల్ ఫోన్లకు ఆటోమేటిక్‌గా జనరేట్ అయిన చలాన్ల మెసేజ్‌లు వెళ్తాయి. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధలను పాటించేలా పోలీసులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు.
మెదక్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి. నిబంధనలు అతిక్రమిస్తే కూడళ్లలోని సీసీ కెమెరాలతో వాహన నంబర్లకు ఆటోమేటిక్‌గా చలాన్లువేస్తారు. చలాన్లు వేసిన తర్వాత వాహన యజమానికి మెస్సెజ్ రూపంలో జరిమానా వివరాలు చేరుతాయి. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి.
– రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ, మెదక్