తెలంగాణ అడవుల అందాలకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్‌కుమార్ ఫిదా అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకుని స్వయంగా చూడాలన్న ఆసక్తితో శనివారం ఆయన గజ్వేల్, ములుగు మండలాల్లో పర్యటించారు. అటవీ కళాశాలను ఆయన ఉత్తరప్రదేశ్ అటవీశాఖ కార్యదర్శి అశీష్, అటవీశాఖ చీఫ్ మనీష్ మిట్టల్‌తో కలిసి సందర్శించారు. గ్రామ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించిన ఆయన చాలా బాగుందంటూ అధికారులతో సంతోషాన్ని పంచుకున్నారు. గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన ఉత్సాహంగా పర్యటించడం విశేషం.
గజ్వేల్/ములుగు, సెప్టెంబర్ 10: తెలంగాణ అడవి అందాలకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ మంత్రి డాక్టర్ అరుణ్‌కుమార్ ఫిదా అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకుని స్వయంగా చూడాలన్న ఆసక్తితో శనివారం గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి ఆశీష్, అటవీ శాఖ చీఫ్ మనీష్మిట్టల్తో కలిసి పర్యటించారు. వారికి రాష్ట్ర అటవీశాఖ సలహాదారు శోభ, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సీసీఎఫ్ డాక్టర్ ఎస్జే ఆశ, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు అడవుల అభివృద్ధి గురించి వివరించారు. ముందుగా ములుగు మండలం జప్తిసింగాయపల్లిలో పల్లెప్రకృతి వనాన్ని యూపీ మంత్రి అరుణ్‌కుమార్ పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న యూపీ మంత్రికి సర్పంచ్ నీలం కొండల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు తదితరులు స్వాగతం పలికారు.
గ్రామ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించిన ఆయన చాలా బాగుందంటూ అధికారులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పల్లెప్రకృతి వనం ఏ విధంగా ఏర్పాటు చేశారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజీవ్ రహదారికి ఇరువైపులా మూడంచెలుగా పెంచిన చెట్లను పరిశీలిస్తూ గజ్వేల్‌లోని వెజ్,నాన్‌వెజ్ మార్కెట్‌కు చేరుకున్నారు. మార్కెట్లో పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం దుకాణాలను పరిశీలించగా మార్కెట్ నిర్వహణ గురించి అధికారులు ఆయనకు వివరించారు. ప్రజలందరికీ వెజ్,నాన్‌వెజ్ ఒకేచోట దొరికేలా సమీకృత మార్కెట్ నిర్మించారని, దేశానికి మోడల్‌గా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని రాష్ట్ర అటవీశాఖ సలహాదారు శోభ వివరించారు.
ములుగు అటవీ కళాశాలకు వెళ్తూ మార్గమధ్యలో గౌరారం మార్క్ కంపెనీ ఎదురుగా అటవీ శాఖ నిర్వహిస్తున్న అవెన్యూ ప్లాంటేషన్, ములుగులో డబుల్ బెడ్రూం ఇండ్లు, గ్రామ నర్సరీని పరిశీలించారు. నర్సరీలో రెండుమీటర్ల పొడవు ఉన్న మొక్కల పెంపకాన్ని చూసి యూపీ మంత్రి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర అటవీశాఖ సలహాదారు శోభ పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటడానికి ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసినట్లు యూపీ మంత్రికి వివరించారు. నర్సరీలకు ప్రభుత్వమే ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటు 10శాతం గ్రామపంచాయతీ నిధులతోనే నర్సరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ములుగు నర్సరీలో పెంచిన మొక్కలు ఇతర గ్రామాలకు కూడా పంపించామని శోభ వారికి తెలుపడంతో ఆమెను అధికారులు, మంత్రి అభినందించారు.
నర్సరీని పరిశీలిస్తున్న సందర్భంగా స్థానిక సీనియర్ నాయకుడు అర్జున్‌గౌడ్ మంత్రి అరుణ్‌కుమార్‌తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారని, పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లను చూడండి అంటూ వివరించారు. మంత్రి అర్జున్గౌడ్తో మాట్లాడుతూ అవును మీదగ్గర చాలా బాగా పనులు జరిగాయి, పచ్చని చెట్లు బాగున్నాయి. ఇంకా చాలా తెలుసుకున్నాను మీ దగ్గర అంటూ వాహనం ఎక్కి ములుగు అటవీ కళాశాలకు బయలుదేరారు. ములుగు అటవీ కళాశాలలో ప్రభుత్వ సలహాదారు శోభ అన్ని వివరాలను ఆయనకు తెలియజేశారు. అనంతరం భోజనం చేసి మంత్రి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నా యూపీ మంత్రి అరుణ్‌కుమార్ గజ్వేల్ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూడడానికి వర్షాన్ని లెక్క చేయకుండా పర్యటనను కొనసాగించారు. ములుగు మండలం జప్తిసింగాయపల్లి పల్లె ప్రకృతి వనం చూసిన అనంతరం గజ్వేల్‌కు బయలుదేరగానే ప్రారంభమైన వర్షం పర్యటన పూర్తయ్యే వరకూ ఉన్నది. వర్షాన్ని లెక్కచేయకుండా అభివృద్ధి పనులను చూడాలన్న ఆసక్తితో పర్యటనను కొనసాగించడం అందరిలో ఉత్సాహాన్ని నింపింది.
రాష్ట్రంలో అడవుల అభివృద్ధి చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి డాక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. పర్యటన పూర్తయిన అనంతరం ములుగు అటవీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొన్న రాత్రి మైన్స్ కాన్ఫరెన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చామన్నారు. తెలంగాణ గురించి చాలా గొప్పగా విన్నామని, ఇక్కడ అడవులు బాగా అభివృద్ధి చేశారని తెలుసుకుని చూద్దామని వచ్చానన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయని, గ్రామ పంచాయతీ, అధికారులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి సాధించడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఇక్కడి పచ్చదనం చూసి చాలా ఆనందం కలిగిందని, రోడ్లకు ఇరువైపులా, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటడం చాలా అందాన్ని కలిగించాయన్నారు.
నర్సరీల్లో కూడా 10ఫీట్ల వరకు పెరిగిన మొక్కలు ఉన్నాయని, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అందులో పిల్లల కోసం ఆటవస్తువులు, ఓపెన్ జిమ్ తదితర వాటిని చూసి మనసు పులకించిందన్నారు. మేము ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకుని వెళ్తున్నామన్నారు. ఇక్కడి కన్జర్వేటర్, మాజీ హెచ్‌డీవో శోభకు ధన్యవాదాలు, ఆమె ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారన్నారు. అవకాశం వస్తే తాము ఆమె నుంచి నేర్చుకోవడానికి తమ రాష్ర్టానికి పిలుస్తామన్నారు. ఇక్కడ అధికారుల పనితీరు చాలా బాగుందని, మేము అన్ని చోట్ల ఈ విషయాన్ని గుర్తించామన్నారు. హెచ్వోఎఫ్ఎఫ్ డోబ్రియాల్ తెలంగాణలో అడవుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రత్యేకంగా కేటాయిస్తు న్న హరితనిధి తదితర వాటి గురించి యూపీ మంత్రి అరుణ్‌కుమార్‌కు వివరించారు. అటవీ కళాశాల అధికారి వెంకటేశ్వర్, ఎఫ్ఆర్వో కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.