చేర్యాల, సెప్టెంబర్ 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలో గడపగడపకూ చేరుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని వాసవి గార్డెన్లో 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు. తెలంగాణలో సంపదను పెంచి పేదలకు సంక్షేమ పథకాల రూపంలో సీఎం కేసీఆర్ పంచుతు న్నారని గుర్తుచేశారు.
రాష్ర్టాలు పన్నుల రూపంలో చెల్లించిన సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన రూ.2లక్షల75వేల కోట్లను తీసుకొచ్చి వారు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా న్యాయపరంగా రావాల్సిన నిధులను తొక్కిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికే బీజేపీ వల్ల ముప్పు ఉన్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ కాపాడేందుకు నడం బిగించారన్నారు. ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ తాడెం రంజిత, సర్పంచులు పెడుతల ఎల్లారెడ్డి, చీపురు రేఖ, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, మహిళా అధ్యక్షురాలు పచ్చిమడ్ల మానస, తహసీల్దార్ ఆరీఫా, కౌన్సిలర్ ఆడెపు నరేందర్ పాల్గొన్నారు.