సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని 28 రాష్ర్టాల్లోని అన్నివర్గాల ప్రజలు మోడీ పాలనపై విసుగెత్తారని, దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బీజేపీ కులం, మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మోడీ నిరంకుశ పాలనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధ్దిని పరుగులు పెట్టించడంతో పాటు సరికొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌వైపు అన్ని రాష్ర్టాల ప్రజలు చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తమతోపాటు అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని, ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ఆయనకు వీరతిలకం దిద్ది జాతీయ రాజకీయాల్లోకి పంపేందుకు సిద్ధ్దంగా ఉన్నట్లు తెలిపారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో పరిస్థితులు మారుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న భరోసా ప్రజలకు ఉందన్నారు.
గవర్నర్ విమర్శలు సరికాదు..
రాష్ట్ర గవర్నర్ తమిళిసై తన పరిధిదాటి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయటం సరికాదన్నారు. ఆమె వ్యాఖ్యలు అర్థరహితమని తెలిపారు. గవర్నర్ తన హోదాను మరిచి బీజేపీ నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌ను బీజేపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చారని ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్ర ఘోరంగా విఫలమైనందునే ప్రజల దృష్టిని మార్చేందుకు గవర్నర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కుల, మతచిచ్చు రేపి రాజకీయపబ్బం గడుపుకోవాలనుకునే బీజేపీకి ప్రజలు బుద్ధ్దిచెప్పటం ఖాయమన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, జలందర్, కౌన్సిలర్లు సాబేర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.