మెదక్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివృద్ధి సంక్షేమ రంగాల్లో జిల్లాను ముందుంచి ప్రతీ పంచాయతీ జాతీయ అవార్డు సాధించేలా అధికారులు కృషి చేయాలని మెదక్ స్థానిక సంస్థల కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, ఏంపీటీసీలు, ఏపీవోలు, సీడీపీవోలు, హెల్త్ సూపర్వైజర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2030 నాటికీ దేశంలోని అన్ని పంచాయతీలు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏప్రిల్ 24న పంచాయత్‌రాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నదన్నారు.
అందుకోసం ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో ప్రశ్నాపత్రాల రూపంలో ఎంట్రీలు ఆహ్వానిస్తున్నదన్నారు. 17 అంశాల్లో స్థిరమైన అభివృద్ధి ప్రామాణికంగా ఈ అవార్డుల ఎంపికకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 9 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద ఒక్కో అంశంలో మూడు అవార్డుల చొప్పున ఇవ్వనున్నదని తెలిపారు. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద మండల, జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అవార్డు పొందడమే లక్ష్యంగా మెదక్ జిల్లాలోని 469 పంచాయతీలు, 20 మండలాలు ఈ పోటీల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
కేటగిరీల వారీగా వివరాలు ..
అధికారులు సమన్వయంతో పనిచేస్తూ 9 ఆంశాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఒక్కో అంశానికి సంబంధించి ధ్రువీకరణలతో కచ్చితమైన సమాచారంఅందించాలన్నారు. ఈ నెల 10 నుంచి 30 వరకు ఆన్లైన్లోని సంబంధిత పోర్టల్‌లో ప్రశ్నాపత్రాల రూపంలో వివరాలు నమోదు చేసి, జిల్లాకు ఎక్కువ సంఖ్యలో అవార్డులు తెచ్చేలా కృషి చేయాలని కోరారు.
తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించాలి
తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించడంలో అందరూ సహకరించాల్సిందిగా అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తన చాంబర్లో భారత ఎన్నికల కమిషన్ ము ద్రించిన కచ్చితమైన వివరాలు ఇచ్చి, తప్పుల్లేని ఓటర్ల జాబితాను బలోపేతం చేద్దాం అనే గోడ పత్రికను స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు కోసం ఫారం 6ను, ఆధార్‌కు అనుసంధానం చేసుకోవడానికి ఫారం-6బిని ఉపయోగించాలని సూచించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలన్నారు. కార్యక్రమం ఈ నెల12 నుంచి 16 వరకు అన్ని గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించాలన్నారు. జిల్లాలోని 1076 అంగన్వాడీ కేంద్రాల్లో 12,231 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, ఈడీఎం సందీప్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.