చవితి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడికి శుక్రవారం భక్తులు వీడ్కోలు పలికారు. స్వామికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తుది పూజలు చేశారు. అందరినీ చల్లగా చూడాలని మొక్కుకున్నారు. శోభాయాత్రలు, ఆటాపాటల మధ్య ‘వెళ్లిరా గణపయ్య.. మళ్లీరావయ్యా’.. అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. శోభాయాత్రలో చిన్నారులు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఊరేగింపులో సందడి చేశారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ’ జై.. అంటూ నినదించారు. మహిళలు దాండియా, కోలాటం ఆడుతూ ఆకట్టుకున్నారు.
చేర్యాల, సెప్టెంబర్ 9 : పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. లడ్డూ, వివిధ రకాల పండ్లను వేలం పాట వేశారు. ఈ సందర్భంగా భక్తులు వేలంపాటలో పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలోని విగ్రహంతో పాటు పట్టణంలోని పలు కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను యువజన సంఘాల సభ్యులు నిమజ్జనం చేశారు. స్వామి వారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుపోవడంతో పాటు నృత్యాలు, ప్రత్యేక వినాస్యాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం ప్రారంభమైన ఊరేగింపు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. పట్టణంలో కుడి చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేయగా, గ్రామాల్లో వ్యవసాయ బావుల్లో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రతిష్ఠించిన లం బోదరుడికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఆలయ సంప్రదాయంతో ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఊరేగింపు ఊరేగించారు. అనంతరం మల్లన్న క్షేత్రంలోని కోనేరులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. పర్యవేక్షకులు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
వినాయక నవరాత్రోత్సవాలు ముగించుకొని గణనాథులు తల్లి గంగమ్మ ఒడికి చేరారు. గురు, శుక్రవారం రెండు రోజుల పాటు వినాయక శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. నిమజ్జనోత్సవంలో యువకుల కేరింతలు, చిన్నారుల చిందులు హుషారుగా సాగాయి. వెళ్లి రావయ్య గణపయ్య.. అంటూ వీడ్కోలు పలికారు. గణపయ్యలను గంగమ్మ ఒడికి చేర్చే వాహనాలు పూలమాలలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. గుర్రపు బండి వినాయకుడి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తీన్మార్ నృత్యాలు, మహిళల కోలాటాలు, దాండియా ఆటలతో వినాయకుల శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ యేడు నిమజ్జనోత్సవాలకు కోమటి చెరువు, గాడిచేర్లపల్లిలోని కాళ్లకుంట, చింతల్ చెరువు, నర్సాపూర్ చెరువు, రంగదాంపల్లి చెరువు, ఇమాంబాద్ చెరువు, ఎర్రచెరువుతో పాటు ఆయా ప్రాంత ప్రజలు వారికి దగ్గరలో ఉన్న చెరువుల్లో నిమజ్జనాలు చేశారు.