సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 9 : జిల్లాలో భూ గర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ జలశక్తి అభియాన్ డిప్యూటీ సెక్రటరీ విజయ్ దత్త అధికారులకు సూచించారు. సిద్దిపేట అర్బన్, కొండపాక, మర్కూక్ మండలాల్లో శుక్రవారం కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులు విజయదత్త, సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ ఆఫీసర్ సందీప్ పర్యటించారు. జిల్లాలో నీటి సం రక్షణ, భూగర్భ జల వనరుల పెంపునకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, బృహత్ పల్లె ప్రకృతి వనంలో ప్లాంటేషన్, రూప్ ట్యాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, అటవీ ప్రాంతంలో పార్క్యులేషన్ ట్యాంక్‌లు, ఎస్ఎంసీ స్ట్రక్చర్‌ను పరిశీలించారు.
అనంతరం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను ఎంఎన్ఆర్ఈజీఎస్ ద్వారా తెలంగాణకు హరితహారం లో మొక్కలు నాటడం, మున్సిపాలిటీలు, ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, దవాఖానలు, వ్యాపార సముదాయాల పరిసరాల్లో ఇంకుడు గుంతలు తవ్వడం, కొత్తగా నిర్మించుకునే ఇండ్లలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతి ఇవ్వడం.. తద్వారా వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టిందన్నారు. అటవీ ప్రాంతాల్లో బ్లాక్ వైజ్‌గా పర్క్యూలేషన్ ట్యాంకులు, ఎస్ఎంసీ స్ట్రక్చర్‌ను నిర్మించి భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేయడం జరిగిందని కలెక్టర్ అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర జల శక్తి అధికారులు మాట్లాడుతూ జిల్లాలో డిస్టిక్ వాటర్ కన్జర్వేషన్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి, ప్రజల్లో నీటి ప్రాముఖ్యత, వాననీటి సంరక్షణపై అవగాహన పెంచాలన్నారు. జిల్లాలో వాన నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపునకు తీసుకున్న చర్యలపై ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు జలశక్తి అభియాన్‌కు నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో పరిశీలించిన పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయని వారు అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో గోపాల్‌రావు, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గజ్వేల్, సెప్టెంబర్ 9 : గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, మర్కూక్ మండలాల్లో శుక్రవారం జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. డీఆర్డీవో గోపాలరావు, ఏపీడీ ఓబులేషు, ఎంపీడీవో ప్రవీణ్, సీటీఏ యాదగిరి వర్గల్, మర్కూక్ మండలాల్లో అమృత్ సరోవర్ పథకం కింద అభివృద్ధి చేసిన కుంటలను కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి విజయ్, సందీప్‌కు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్, సీఆర్డీ శశికుమార్‌కు వివరించారు. ముం దుగా అమృత్ సరోవర్ పథకం కింద అభివృద్ధి చేసిన వర్గల్ మండల కేంద్రంలోని కొత్తకుంట, మర్కూక్ మండలం కాశిరెడ్డిపల్లి పీర్ల కుంటలను పరిశీలించారు. కాశిరెడ్డిపల్లిలో పీర్ల కుంటను పరిశీలించిన అధికారుల బృందం పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు చెందిన రైతులను ప్రశ్నించా రు.
అందుకు రైతులు గతంలో తమ బోర్లు చాలా తక్కువగా నీరు పోసేవని, కుంటను అభివృద్ధి చేసిన తర్వాత బోర్లలోకి నీరు బాగా చేరిందని చెప్పారు. అనంతరం మర్కూక్‌లో బృహత్ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. 30వేల మొక్కలను అందంగా తీర్చిదిద్దిదన బృహత్ పల్లెప్రకృతి వనాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మర్కూక్ పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాన్ని పరిశీలించి బాగా నిర్వహిస్తున్నందుకు సర్పంచ్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శాంతి, ఉపాధి హామీ సిబ్బందిని అభినందించారు. పాతూర్ గ్రామంలోని పంచాయతీ వద్ద వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌ను పరిశీలించారు. అనంతరం కొండపాక మండలంలోని లకుడారం ఫారెస్ట్ నర్సరీలోని నర్సరీలో ఫాంఫండ్ను పరిశీలించారు.