గజ్వేల్/ములుగు, సెప్టెంబర్ 9: కొండపోచమ్మ సాగర్ ఒక సాసర్ లాంటి అద్భుతమైన నిర్మాణమని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. శుక్రవారం మర్కూక్ మండలంలోని కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు, పంప్‌హౌస్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు చుట్టూ కట్టపై కలియదిరిగారు. ప్రాజెక్టు గురించి కలెక్టర్‌కు ఎస్ఈ వేణు వివరించారు. కొండపోచమ్మ ప్రాజె క్టు నుంచి సంగారెడ్డికి నీటిని సరఫరా చేసే కెనాల్‌ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎత్తైన జలాశయం కొండపోచమ్మ సాగర్ అని కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు నీటిని తరలించే విధానాన్ని ఎస్ఈ వివరించారు.
ప్రాజెక్టులో అటవీ, ప్రభుత్వ భూములు, కట్టపై సందర్శకులకు అందిస్తున్న సౌకర్యాలకు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొండపోచమ్మ సాగర్ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. దేశంలోనే అత్యద్భుత ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ అని, ఇక్కడ భద్రతా చర్యలను పటిష్టంగా నిర్వహించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, పంపుహౌస్‌ల వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా, క్రమశిక్షణతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది సూచించారు.
కొండపోచమ్మ సాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిన పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు, ఆర్అండ్ఆర్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలన్నీంటినీ చట్టప్రకారం పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అన్నారు. శుక్రవారం ములుగు అటవీ కళాశాలలో మామిడ్యాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులు, సం బంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం సందర్భంగా భూమిని, ఊరిని, ఇండ్లను కోల్పోయి ఇంకా ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజల్లో కొంతమంది కోల్పోయిన భూమి నష్టపరిహారం, ప్లాట్ల కేటాయింపు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాలనీలలో గుడి, బడి, ఆరోగ్యకేంద్రాలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాల నిర్మా ణం ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరగా, గ్రామాల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటికే కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపామని, సమావేశం ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను చట్టప్రకారం పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, టీఎస్ఐడీసీ ఇంజినీర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.