నవరాత్రులను ముగించుకుని గణనాథులను శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. మండపాల వద్ద అన్నదానం, లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. అనంతరం పోలీసు బందోబస్తులో శోభాయాత్ర కొనసాగింది. మెదక్, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని చోట్ల విగ్రహాలను నిమజ్జనం చేయగా మరికొన్ని నేడు నిమజ్జనం చేయనున్నారు. సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జరిగిన నిమిజ్జన శోభాయాత్ర డీజే సౌండ్, బ్యాండ్ మేళాలతో అంగరంగా వైభవంగా కొనసాగింది.
మెదక్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో మరికొన్ని గంటల్లో నిమజ్జన వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 11రోజుల పాటు విశేష పూజలందుకున్న వినాయకులను శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారు జామున వరకు శోభా యాత్ర కనుల పండువగా సాగనున్నది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖలు పూర్తి చేశాయి. పారిశుధ్యం, క్రేన్ల నిర్వహణ, నిమజ్జన పనులను మున్సిపల్ శాఖ పర్యవేక్షిస్తుండగా, పోలీసు శాఖ బందోబస్తు, ఇతర ఏర్పాట్లు రెవెన్యూశాఖ పర్యవేక్షిస్తోంది. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని భారీ బందోబస్తును సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం మెదక్ మండలం కొంటూర్ చెరువు వద్ద ఏర్పాట్లను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు.

నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందుకోసం జిల్లాకు ప్రత్యేక బలగాలను రప్పించారు. మెదక్ ఎస్పీ ఆధ్వర్యంలో 750మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ ఫోర్స్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2575 గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయగా, శుక్రవారం వరకు 1109 గణనాథులను నిమజ్జనం చేశారు.
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, చేగుంట, కౌడిపల్లి, కొల్చారం ప్రాంతాల్లో నిమజ్జనం సందర్భంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తారు. శోభాయాత్ర జరిగే మార్గంలో విద్యుత్లైన్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లు, గుంతలను పూడ్చడం వంటి పనులు పూర్తి చేశారు. క్రేన్లు, గజ ఈతగాళ్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. మున్సిపల్, విద్యుత్‌శాఖ, ఆర్అం డ్బీ, అగ్ని మాపక, వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మెదక్ మున్సిపల్ ఆధ్వర్యంలో మెదక్ రాందాస్ చౌరస్తాతో పాటు ఆయ వార్డుల్లో తాగునీటి వసతి కల్పించారు. నిమజ్జ న పాయింట్లలో వైద్యశాఖ తరపున అంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచారు. వేడుకలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, ఎస్పీ రోహిణి ప్రి యదర్శిని, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
మెదక్ రూరల్, సెప్టెంబర్ 9: నిమజ్జన వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కోంటూరు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ బందోబస్తు గురించి డీఎస్పీ సైదులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డీఎస్పీ సైదులు ఆర్డీవో సాయి రాం, మున్సిపాల్ కమిషనర్ శ్రీహరి, రూరల్ సీఐ విజయ్, ఎస్ఐ మో హన్‌రెడ్డి, ప్రజాప్రతినిథులు, నాయకులు పాల్గొన్నారు.
చేగుంట/రామాయంపేట,సెప్టెంబర్09,వినాయక నిమజ్జనాలలో తగు జాగ్రత్తలను తీసుకోవాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రామాయంపేట, నార్సింగి, రెడ్డిపల్లిలో నిమజ్జనాల చెరువులను పరిశీలించారు. శోభయాత్ర, నిమ జ్జనాలకు వెళ్లే రూట్లను పరిశీలించి పలుసూచనాలు చేశారు.
