మెదక్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): డెంగీ, విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, ఆయాసం, కంటి కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు, నీరసం, వాంతులు, విరేచనాలు కావడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉండడం డెంగీ వ్యాధి లక్షణాలని, ఈడీస్ దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ఈ దోమలు ఇండ్లలోని, ఇంటి కృత్రిమ నీటి నిల్వ ఆవాసాల్లో ఎక్కువగా పెరుగుతాయని, పగటి వేళలో కుడతాయని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ దవాఖానల్లో సంప్రదించాలని, ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయబడుతాయని పేర్కొన్నారు. ఇండ్లలోని కూలర్లు, పూల కుండీలు, టైర్లు కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వారానికి ఒకసారి నీటి తొట్లు, ఇతర పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి మళ్లీ నీరు నింపుకోవాలని తెలిపారు. ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని ఆమె ప్రజలకు సూచించారు.
బాలికల గురుకుల పాఠశాలలో..
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 8: విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. రుచికరంగా వండుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్‌ను సందర్శించి మెనూ చార్ట్‌ను ఏర్పాటు చేయాలని వార్డెన్‌కు సూచించారు. వంట గదిలోని సరుకులను పరిశీలించారు. వంట గది వెనుకల నిలిచిన మురుగు నీటిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరికి సూచించారు. వసతి గృహాల గదులు సందర్శించి పరుపులు సరిపోనూ లేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. తరగతి గదిలను పరిశీలించి, పలు వివరాలను అడిగి తెలుసుకుని, బోర్డుపై విద్యార్థినులతో లెక్కలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రతను పాటించాలని, సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలని, అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటామని సూచించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. వసతి గృహాల్లో స్నానపు గదులు, మూత్రశాలలు, వసతి గృహ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, యునెస్కో జిల్లా కో ఆర్డినేటర్ గంగాధర్‌లో కలిసి క్రిములు కాదు ఆహారం తినండి అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆమె వెంట సాంఘిక సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి శ్రీదేవి, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ఉపాధ్యాయులు లక్ష్మి, సలోమి, మేషక్, దయాకర్ తదితరులు ఉన్నారు.