జహీరాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం బుచినెల్లి ఇండస్ట్రియల్ పార్కును ఆటో మొబైల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్- క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఎస్ఈ-సీడీపీ) కింద ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. టీఎస్ఐఐసీ జహీరాబాద్ మండలంలోని బుచినెల్లి శివారులో 314 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసింది. తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో ఇండస్ట్ట్రియల్ క్లస్టర్లు అభివృద్ధి చేసేందుకు నిర్ణయించగా, అందులో సంగారెడ్డి జిల్లాలోని బుచినెల్లి పార్కు ఒకటి. బుచినెల్లి పార్కులో రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం కల్పించడంతో పలువురు పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించారు. మహీంద్రా అండ్ మహీంద్రాకు అనుబంధంగా ఉన్న ఆటో మొబైల్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కాలుష్య రహిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు ప్రారంభించారు. దీంతో బుచినెల్లి చుట్టు పక్కల ఉన్న ఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తున్నది.
314 ఎకరాల్లో టీఎస్ఐఐసీ పార్కు..
ప్రభుత్వం జహీరాబాద్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించింది. పారిశ్రామిక పార్కులో ప్రభుత్వం రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పించింది. బుచినెల్లి శివారులో ఇప్పుటికే పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు ప్రారంభించాయి. మహీంద్రా అండ్ మహీంద్రాకు అనుబంధంగా ఉన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కలిపిస్తున్నాయి. మహీంద్రాకు కావాల్సిన పరికరాలు బుచినెల్లి శివారులో ఉన్న పారిశ్రామిక పార్కులో ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాలకు చెందిన నిరుద్యోగులతో పాటు కర్ణాటకకు చెందిన యువత ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిరోజూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
బుచినెల్లి టీఎస్ఐఐసీ పార్కులో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. పరిశ్రమలు ఏర్పాటు చేసే వ్యాపారులకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సింగిల్ విండో విధానంతో అనుమతులు ఇవ్వడంతో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వెంటనే ఇవ్వడం జరుగుతున్నది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 70 పరిశ్రమలను బుచినెల్లి శివారులో స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుచినెల్లి ఇండస్ట్రియల్ పార్కు 65వ జాతీయ రహదారిపై ఉండడంతో పాటు రైల్వేస్టేషన్ ఉంది. పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వాటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు రవాణా సౌకర్యం ఉంది. వ్యాపారులు హైదరాబాద్, ముంబయి నుంచి నేరుగా బుచినెల్లి పారిశ్రామిక ప్రాం తానికి చేరుకునే అవకాశం ఉంది.
పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు మేలు
ప్రభుత్వం బుచినెల్లి టీఎస్ఐఐసీ పార్కులో ఆటో మొబైల్ పరిశ్రమలు ఏర్పా టు చేయడంతో నిరుద్యోగులు ఉపాధి లభిస్తున్నది. జహీరాబాద్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటో మొబైల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయడం సంతోషంగా ఉంది.
-రాములునేత, మాజీ కౌన్సిలర్ జహీరాబాద్
పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి
బుచినెల్లి టీఎస్ఐఐసీ పార్కును ఆటో మొబైల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయడం సంతోషంగా ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తున్నది. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతో మంది యువతకు మేలు జరుగుతున్నది. పారిశ్రామిక వేత్తలు గ్రామాల అభివృద్ధికి ముందుకు వస్తే బాగుంటుంది. సీఎస్ఆర్లో నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలి.
-కే.రాజు, సర్పంచ్, తుంకుంట