స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సెర్ప్ సహకారంతో స్త్రీనిధి రుణాలను అందజేస్తుండడంతో వారంతా వ్యాపార రంగాల్లో ఎంతో రాణిస్తున్నారు. జీవనోపాధి కోసం టైలరింగ్, కిరాణా, వస్త్ర దుకాణాలు, హోటళ్లు, బ్యూటీపార్లర్, విస్తరాకుల తయారీ, జిరాక్స్ సెంటర్, జనరిక్ మెడికల్ షాపు తదితర వంద రకాలకుపైగా యూనిట్లు ఏర్పాటు చేసుకుని స్వయంశక్తితో ఎదుగుతున్నారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే అధికారులు లోన్ మంజూరు చేసి, డబ్బును నేరుగా సభ్యురాలి సంఘం ఖాతాలో జమ చేస్తున్నారు.
ప్రాసెసింగ్, దరఖాస్తు ఫీజు, జీఎస్టీ లాంటి అదనపు ఖర్చులు లేకుండా అర్హతను బట్టి ఒక్కొక్కరికి గరిష్ఠంగా సుమారు రూ.లక్ష వరకు రుణం ఇస్తున్నారు. పదకొండు శాతం వడ్డీతో 24 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. మెదక్ జిల్లాలో 13,500 మహిళా సంఘాలు ఉండగా, వాటిలో లక్షా 40వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.130.06కోట్ల రుణాలు టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ. 20.77 కోట్లు అందజేశారు.
మెదక్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సమన్వయంతో ్రస్త్రీనిధి ద్వారా జీవనోపాధి రుణాలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టే వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని స్త్రీనిధి ద్వారా సమకూరుస్తున్నారు.
సభ్యులు జీవనోపాధికి ఒకవైపు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణసదుపాయం కల్పిస్తూనే, స్త్రీనిధి ద్వారా జీవనోపాధి రుణం కింద గరిష్ఠంగా ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు మంజూరు చేస్తున్నారు. రుణాన్ని 24 సమాన వాయిదాల్లో చెల్లించేలా 11 శాతం వడ్డీతో అందిస్తున్నారు. మెదక్ జిల్లాలో 13,500 స్వయం సహాయక సంఘాలు ఉండగా, వాటిలో లక్షా 40వేల మంది సభ్యులున్నారు.
2019-20 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు మూడేండ్లల్లో స్త్రీనిధి ద్వారా 35,802 మంది మహిళలకు జీవనోపాధి రుణం రూ.255.68 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.130.06కోట్ల రుణాలు టార్గెట్ కాగా, ఇప్పటి వరకు రూ.20.77 కోట్లు మహిళా సంఘాలకు అందజేశారు.
జీవనోపాధి రుణం కోసం సభ్యురాలు అభ్యర్థన పెట్టుకున్న 48 గంటల్లో రుణం మంజూరవుతుంది. స్త్రీనిధి ద్వారా రుణం పొందేందుకు ప్రాసెసింగ్ ఫీజు, దరఖాస్తు రుసుం, జీఎస్టీ లేవు. రుణం కోసం సభ్యురాలు స్త్రీనిధి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. రుణం కావాలనుకునే మహిళ తమ సంఘ సమావేశంలో దరఖాస్తు చేసుకుంటే చాలు. యానిమేటర్ వచ్చి బయోమెట్రిక్ ద్వారా సభ్యురాలి వేలిముద్ర తీసుకుంటారు. రుణం నేరుగా సభ్యురాలి సంఘం ఖాతాలో జమ అవుతుంది. సంఘ సమావేశంలో లీడర్ తీర్మానం చేసి సభ్యురాలి ఖాతాకు రుణ మొత్తాన్ని పంపిస్తారు.
డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు స్త్రీనిధి ద్వారా రుణాలు పొందవచ్చు. టైలరింగ్, కిరాణా, వస్త్ర వ్యాపారం, హోటళ్లు, బ్యూటీపార్లర్, విస్తరాకుల తయారీ, జిరాక్స్ సెంటర్, బర్రెలతో పాటు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బైక్‌లు, ఎలక్ట్రిక్ ఆటోలు, జనరిక్ మెడికల్ షాపు, ఇతర చేతి వృత్తులు వంటి వంద రకాల యూనిట్ల స్థాపన, విస్తరణ, అభివృద్ధికి రుణాలు వినియోగించుకోవచ్చు.
స్త్రీనిధి ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యం. నాలుగు సంవత్సరాల్లో 35,802 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.276 కోట్ల ్రస్త్రీనిధి రుణాలు పంపిణీ చేశాం. రుణ రికవరీ వందశాతం ఉండేలా చూస్తున్నాం. రుణం పొందిన వారు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఏడాది కూడా లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.
– శ్రీనివాస్, డీఆర్డీవో మెదక్
డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. స్త్రీనిధిలో మహిళలు అడిగిన వెంటనే రుణాలు అందేలా చర్యలు చేపట్టాం. సకాలంలో తిరిగి చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీ మొత్తం కూడా వారి ఖాతాల్లో జమ చేస్తున్నది.
– కె. గంగారాం, స్త్రీనిధి రీజినల్ మేనేజర్, మెదక్
మనోహరాబాద్‌లోని లత సింగం స్వయం సహాయక సంఘంలో నేనే సభ్యురాలిని. స్త్రీనిధి ద్వారా రూ.లక్ష జీవనోపాధి రుణం తీసుకొని ఇంటి వద్దనే బ్యాంగిల్స్, ఫన్నీస్టోర్ జిరాక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నా. వస్తున్న ఆదాయ నుంచి నెలనెలా కిస్తీలు చెల్లిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నా. స్త్రీనిధి మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
– లత, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, మనోహరాబాద్ (మెదక్ జిల్లా)