సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక పరిజ్ఞానంతో పాటు లోకజ్ఞానం, సంస్కారాన్ని నేర్పి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ శరత్ పాల్గొనగా జిల్లాలోని 80 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. మెదక్ కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరై 64 మందిని సన్మానించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రులు సబితారెడ్డి, మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.
సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 5: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటిని తొలగించి, విజ్ఞానం వైపు నడిపించేది గురువులేనన్నారు. దేశ భవిష్యత్తుకు, మంచి సమాజ స్థాపనకు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. పాఠ్య పుస్తకాలే కాక లోకజ్ఞానాన్ని అందించాలన్నారు. సంస్కారాన్ని నేర్పి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది ఉపాధ్యాయులేనన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. విద్యార్థులకు అన్ని వసతులతో విద్యను అందించాలని మన ఊరు-మనబడి కార్యక్రమం చేపట్టిందని, జిల్లాకు రూ.242 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో గురువుల అకుంఠిత దీక్ష ఎనలేనిదన్నారు.
గురువు స్థానం ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటుందన్నారు. అనంతరం 80మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఈవో నాంపల్లి రాజేశ్, ఎంఈఓలు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 5: సమాజ నిర్మాణానికి ఆద్యుడు.. అందరికీ ప్రేరణ కలిగించేవాడు ఉపాధ్యాయుడు అని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మనం ఈ రోజు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్నామంటే అది ఉపాధ్యాయుడు మనకు నేర్పిన విజ్ఞానం, క్రమశిక్షణ అని అన్నారు.
తల్లిదండ్రుల తర్వా త విద్యార్థులను అంత ప్రభావితం చేయగల వ్యక్తి ఉపాధ్యాయుడేనన్నారు. సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఎంపికైన 64 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్ అధికారి సుభాశ్‌నాయక్, ఎంఈవోలు బుచ్చయ్యనాయక్, నీలకంఠం, సహాయ సంచాలకుడు శంకర్ పాల్గొన్నారు.