ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు సహకరిస్తే, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీ భవన్లో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మనం చదువు చెప్పే పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎంత విజ్ఞానవంతులైన విద్యార్థులను తయారు చేస్తే సమాజం అంత బాగుంటుందన్నారు. అలాగే, జిల్లాకు చెందిన అమరవాది రాజశేఖరశర్మ, ఓంకార్, జే శ్రీనివాస్‌రెడ్డి, ఎం.రాంప్రసాద్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారికి తోటి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, ఎంత ఉన్నత స్థానానికి ఎదగాలన్నా గురువు పాత్ర చాలా కీలకమని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీ భవన్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మనం చదువు చెప్పే పిల్లల భవిష్యత్, మన చేతుల్లోనే ఉంటుందన్నారు.
ఎంత విజ్ఞానవంతులైన విద్యార్థులను తయారు చేస్తే, సమాజం అంత బాగుంటుందన్నారు. సీఎం కేసీఆర్ తన గురువులను ఏ విధంగా పాదాభివందనం చేస్తారో మనందరం చూశామని, అంతటి ఉన్నత స్థానం ఉపాధ్యాయులదన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, జిల్లాలోని ఉపాధ్యాయులందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా పదో తరగతిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ‘మనఊరు-మనబడి’ అనే గొప్ప కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు సహకరిస్తే, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన నలుగురు ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని, విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు బడుగు, బలహీన వర్గాల వారే ఉంటారని, వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. ఒకపేద కుటుంబం ఉన్నత కుటుంబంగా ఎదగాలంటే చదువు ఎంతో ముఖ్యమని, అలాంటి పేద విద్యార్థులకు ఉపాధ్యాయులే మంచి మార్గాన్ని చూపెట్టాలన్నారు.
సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు పదో తరగతి ఫలితాల్లో ముందుండడం గర్వ కారణమన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి, ఘనంగా సన్మానించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలు, నాయకులు పాల్గొన్నారు.