మెదక్ అర్బన్, సెప్టెంబర్ 5: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని ఆర్డీవో సాయిరామ్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి భూ సమస్యలు, రెండు పడకగదుల ఇండ్ల కేటాయింపు తదితర అంశాలకు సంబంధించిన 61 విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
నర్సంపేట మండలం రుస్తుంపేట సర్వే నంబర్ 74లో 40 ఎకరాల 3 గుంటల్లో 80 సంవత్సరాల నుంచి మేము కాస్తూ చేస్తుండగా, మా పక్క సర్వే నంబర్ 73 వారు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని రాము విజ్ఞప్తి చేయగా, సర్వే చేయవలసినదిగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులకు సూచించారు.
ఇంటి నిర్మాణానికి అనుమతి పొందినా పక్కింటి నుంచి పోతున్న విద్యుత్ వైర్లు సరిచేయించిన తరువాత నిర్మాణం కొనసాగించాలని సర్పంచ్ వేధిస్తున్నాడని శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన రేణుక ఫిర్యాదు చేయగా, తగుచర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. మెదక్ పట్టణానికి చెందిన రేష్మబేగం, జూకంటి రాధికలు రెండు పడకల ఇండ్లు కేటాయించాలని అభ్యర్థించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అందజేసిన పలు సమస్యల వినతులను వారు స్వీకరించారు.