వెల్దుర్తి, సెప్టెంబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల గౌరవం పెరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి బాలాజీ గార్డెన్లో మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 880 మందికి ఆసరా పింఛన్ పత్రాలు, 49 కల్యాణలక్ష్మి చెక్కులను రాష్ట్ర అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ దేవేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అభివృద్థి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా పింఛన్లకు అందజేస్తున్న ఆసరా రుసుమును పెంచి ఇస్తున్నారని అన్నారు. 65 ఏండ్లకు ఉన్న వయోపరిమితిని తగ్గించి 57 ఏండ్లకే ఆసరా పింఛన్లను అందిస్తున్నారన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా సీఎం కేసీఆర్ యువతుల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందించి ఇంటి పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నారని కొనియాడారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని, రైతులను విస్మరించడంతో అన్నదాతలు కూలీలుగా మారి వలసలు వెళ్లారని, ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. నేడు స్వరాష్ట్రంలో చేపట్టిన రైతుబంధు, రైతుబీమా, కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు వంటి వ్యవసాయ సంక్షేమ పథకాలతో వలసలు వాపస్ కాగా, రైతుల ఆత్మహత్యలు లేవన్నారు.
యావత్ దేశంలో సబ్బండ వర్గాలకు అన్ని రకాల సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లో అమలు చేయాలని కోరుతుండగా, సరిహద్దులో ఉన్న ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చే స్తున్నారంటే, రాష్ట్ర అభివృద్ధి ఎలా జ రుగుతుందో గమనించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రజాభీష్టం మేరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగా ణ సర్కార్ సుపరిపాలనను అందిస్తుండగా, ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రభుత్వ పథకాలకు జై కొడుతున్నారని, తగిన సమయంలో ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారన్నారు. సీఎం కేసీఆర్‌ను టీఆర్ఎస్ సర్కార్‌ను ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వెల్దుర్తి పట్టణ సర్పంచ్ భాగ్యమ్మఆంజనేయులు, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ సురేశ్, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, గోపాల్‌రెడ్డి, పడిగె నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.