మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం వారి నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నదని, అందులో భాగంగానే ప్రతి ఏడాది నీటివనరుల్లో చేపపిల్లలను వదులుతున్నదని,దీంతో వేలాది మంది మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతున్నదని అన్నారు. మార్కెటింగ్ కోసం సంచార చేపల విక్రయ వాహనాలను రాయితీపై అందజేస్తున్నదన్నారు.
మెదక్ రూరల్, సెప్టెంబర్ 5: మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ మండలంలోని కోంటూరు చెరువులో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి డాక్టర్ రజనితో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలా మారడంతో ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నదన్నారు. జిల్లాలో ఈసారి 5కోట్ల 4 లక్షల చేపపిల్లలు పంపిణీ చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాలే మారిపోయాన్నారు.
వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రభుత్వం సరాఫరా చేస్తున్నదన్నారు. చేపలు అమ్ముకోవడానికి, సంచార చేపల విక్రయ వాహనాలకు 60 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కుతున్నదన్నారు. మత్స్య సంపద సమృద్ధిగా పెరుగుతుండడంతో స్థానికంగా ఉపాధి లభిస్తున్నదన్నారు. కార్యకమంలో ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, నాయకులు జయరాంరెడ్డి, కిష్టయ్య, వార్డు సభ్యులు, మత్స్య శాఖ సిబ్బంది నరేశ్, సహకార సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందోల్, సెప్టెంబర్ 5: మత్స్యకారులు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ పెద్ద చెరువులో ఎమ్మెల్యే చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కులవృత్తులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు. చెరువులు, కుంటల్లో చేపపిల్లలు వదలడంతో పాటు వాటిని పెంచేందుకు ఉచితంగా దాణా, వలలు, చేపలు విక్రయించేందుకు ద్విచక్రవాహనాలు, ఆటోలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకారులు సొంత ఊరికి వచ్చి చేపలు పడుతూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన కులవృత్తులకు స్వరాష్ట్రంలో మంచి రోజులొచ్చాయన్నారు. అన్ని చెరువుల్లో పెద్దసంఖ్యలో చేపపిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యుడు లింగాగౌడ్, నాయకులు లక్ష్మణ్, అనిల్, వెంకటేశం పాల్గొన్నారు.
కల్హేర్, సెప్టెంబర్ 5: సీఎం కేసీఆర్ చేయూతతోనే మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మార్డి పెద్ద చెరువులో లక్షా 10 వేల చేప పిల్లలను జడ్పీటీసీ నర్సింహరెడ్డి, ఎంపీపీ గర్రపు సుశీలతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
నీళ్లు సమృద్ధిగా ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన చేపలను పెంచి పోషించి, అమ్ముకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. బీజేపీ నాయకులు అబద్ధాలతో సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధాలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టడంతో ప్రజల్లో టీఆర్ఎస్పై మరింత గౌరవం పెరిగిందన్నారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, మత్స్యకారుల సంఘం చైర్మన్ రవి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్, జలందర్ , శ్రీను, నాగిరెడ్డి, బాలరాజ్ పాల్గొన్నారు.