పుల్కల్, సెప్టెంబర్5: మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలను సంగారెడ్డి కలెక్టర్ ఎ.శరత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కలియ తిరుగుతూ భోజన, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రిన్సిపాల్ రత్నయ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంటే మీలాంటి వారితో చెడ్డ పేరు చేస్తున్నదని, ఇక నీ సేవలు ఇక్కడ అవసరం లేదని, ఇలాంటి తప్పులు ఎక్కడా చేయకూడదని ప్రిన్సిపాల్‌ను సరెండర్ చేస్తూ హైదరాబాద్ బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మరో ఉపాధ్యాయుడు రామకృష్ణను ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. విద్యార్థులకు ఎలాంటి కష్టం కలిగించేట్లు వ్యవరించినా, వారు ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పరమేశం, ఎంపీడీవో మధులత ఉన్నారు.