కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే మొదటి విడుత విజయవంతంగా పూర్తవగా, త్వరలో రెండో విడుత ప్రారంభించేందుకు పశుసంవర్థకశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.1.75లక్షలకు పెంచింది. కొన్నిచోట్ల ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఎంపిక పూర్తి చేసి వారి వాటాకింద చెల్లించాల్సిన డబ్బులను సేకరిస్తున్నారు. మెదక్ జిల్లాలో మొదటి విడుతలో 12,998 మందికి ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించగా, రెండో విడుతలో 7,184 యూనిట్లు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 14,366 మంది లబ్ధిపొందగా, ఈసారి 12,142 టార్గెట్‌గా నిర్ణయించారు. ఏదైనా కారణంతో గొర్రెలు చనిపోతే లబ్ధిదారుడు నష్టపోకుండా ప్రభుత్వమే బీమా చేయించి పరిహారం చెల్లిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోస్తున్నది. ఇందులో భాగంగానే గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది. సబ్సిడీ ద్వారా యూనిట్లను అందుకున్న లబ్ధిదారుల ఇండ్లల్లో వెలుగులు నిండుతున్నాయి. గొర్రెల కాపరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సంచార వైద్యం అందించేందుకు అంబులెన్స్‌లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రాసం సమస్య లేకుండా దాణాను కూడా అందజేసి గొర్రెల పెంపకానికి సహకారం అందజేస్తున్నది. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రభుత్వం యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడి వాటాగా రూ.43,750 డీడీల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును ప్రభుత్వం అందజేయనున్నది. కాగా, త్వరలోనే మరింత మందికి గొర్రెల పంపిణీ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో గొల్లకుర్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి/మెదక్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా త్వరలోనే లబ్ధిదారులకు యూనిట్లను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో గతంలో డీడీలు కట్టిన వారికి, మరికొంత మంది నూతన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి.
యూనిట్ విలువ పెంపు..
ప్రతి యూనిట్‌పై ప్రభుత్వం 75 శాతం సబ్సిడీని ఇస్తుండగా, యూనిట్ విలువ గతంలో రూ.1,25,000 వేలు ఉండగా, పెరిగిన ధరల నేపథ్యంలో రూ.1.75,000లకు పెంచారు. ఇందులో లబ్ధిదారుడి వాటా రూ.43,750 చెల్లించగా, మిగతా సొమ్మును సర్కార్ భరిస్తోంది. ఏదైనా కారణంతో గొర్రెలు చనిపోతే పరిహారం ఇవ్వడానికి ప్రతి గొర్రెకు కొనుగోలు సమయంలోనే ప్రభుత్వమే బీమా చేయిస్తున్నది.
పంపిణీకి అధికారుల కసరత్తు
గొర్రెల యూనిట్లను అందజేసేందుకు వీలుగా పశుసంవర్థకశాఖ అర్హులైన సొసైటీ సభ్యుల వివరాలను సేకరిస్తున్నది. అలాగే సొసైటీ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి నామినీ పేరును రిజిష్టర్ చేసి వారికి గొర్రెల యూనిట్ అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన లబ్ధిదారులకు వర్చువల్ బ్యాంకు ఐడీని కేటాయించారు. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని వర్చువల్ బ్యాంకు ఐడీతో డబ్బులను నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. లబ్ధిదారులు తమ వాటా చెల్లించటం పూర్తయిన వెంటనే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను విడుదల చేయనున్నది. సబ్సిడీ డబ్బులు విడుదల ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారులు గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో 343 సొసైటీలు
మెదక్ జిల్లాలో 343 గొర్రెల కాపరుల సహకార సంఘాలు ఉండగా, వీటిలో 20,182 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో 12,998 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. రెండో విడతలో 7,184 యూనిట్ల పంపిణీయే లక్ష్యం కాగా, 162 మంది డీడీలు చెల్లించారు. జిల్లాలో మొత్తం 21 మండలాల్లో 6,04,320 గొర్రెలు, మేకలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
సంగారెడ్డిలో 522 సొసైటీలు
సంగారెడ్డి జిల్లాలో 522 గొర్రెకాపర్ల సొసైటీలు ఉండగా, 30,896 మంది సభ్యులున్నారు. మొదటి విడతలో 14,366 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున మొత్తం 3,01,686 గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు. రెండ విడతలో 4388 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఇంకా 12,142 మంది లబ్ధిరులకు గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం అర్హులకు గొర్రెల యూనిట్లను అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం..
ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి కసరత్తు చేస్తున్నది. బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పంపిణీని ప్రారంభిస్తాం. పెరిగిన యూనిట్ ధరకు అనుగుణంగా లబ్ధిదారులు మిగతా మొత్తాన్ని చెల్లించి అధికారులకు డీడీలు అందించాలి. అర్హులైన లబ్ధిదారులందరికీ గొర్రెలను అందజేస్తాం. రెండో విడతలో 7,184 యూనిట్లను అందించాలన్నదే లక్ష్యం. ఇప్పటి వరకు 162 మంది వాటా డబ్బులను బ్యాంకులో జమ చేశాం.
– వెంకటయ్య, పశు సంవర్ధకశాఖ, మెదక్ జిల్లా ఇన్చార్జి అధికారి