మెదక్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): చేపపిల్లల ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉన్నది. సీఎం కేసీఆర్ మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇటీవల కురిసిన వార్షాలకు చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. దీంతో మత్య్సశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.
జిల్లాలో 1614 చెరువులు
వర్షాధార అనుబంధ రంగాల్లో చేపల ఉత్పత్తి ప్రధానమైనది. ఈ ఏడాది జిల్లాలో వానలు భారీగా కురవడంతో చేపల ఉత్పిత్తి కూడా పెరిగే అవకాశం ఉన్నది. మెదక్ జిల్లాలోని 1614 చెరువులు ఉన్నాయి. చేపల పెంపకానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. దీంతో మత్స్యకారులకూ ఉపాధి దొరికే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.
జిల్లాలో 5 కోట్ల 4 లక్షల టార్గెట్
జిల్లాలో 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే మత్య్సశాఖ అధికారులు ఏఏ చెరువుల్లో ఎన్ని చేప పిల్లలు వదలాలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జిల్లాలో 263 సొసైటీలు
జిల్లాలో 263 మత్య్సకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో 15,724 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్య్సకారుల జీవితాలే మారిపోయాయి. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. చేపలు అమ్ముకోవడానికి ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలతో పాటు ఇతర వస్తువులను సమకూర్చింది.
నేడు కొంటూర్ చెరువులో చేప పిల్లల విడుదల
రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందజేస్తున్న చేప పిల్లలను మెదక్ మండలం కొంటూర్ చెరువులో సోమవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత, వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి హాజరై చేప పిల్లలు వదలనున్నారు. కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు తెలిపాయి.
లక్ష్యాన్ని చేరుకుంటాం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. జిల్లాలో 5 కోట్ల 4 లక్షల చేపపిల్లలు పంపిణీ చేయాలనే టార్గెట్ను చేరుకుంటాం. నేడు మెదక్ మండలం కొంటూర్ చెరువులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేప పిల్లలను వదలనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– డాక్టర్ రజని, జిల్లా మత్స్యశాఖ అధికారి