మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో పాటు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతినెలా మూడో శనివారం సమావేశం నిర్వహించి ప్రతి తరగతిలోని విద్యార్థి తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 921 పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించేలా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలు ఆగస్టు 27 నుంచి ప్రారంభించారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనేలా..
ఇప్పటివరకు పాఠశాల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లో ప్రతి తరగతి నుంచి ఎంపికైన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులే పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక నుంచి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు(పీటీఎం) నిర్వహించాలని నిర్ణయించింది. పాఠశాల, విద్యార్థుల సమస్యలు, లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది.
పీటీఎం లక్ష్యాలు ఇవే..
పాఠశాలను సమాజం, విద్యార్థుల తల్లిదండ్రులతో అనుసంధానానికి పీటీఎం దోహదం చేస్తుంది.
ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణలో క్లాస్ టీచర్ తరగతి పిల్లల తల్లిదండ్రులతో పీటీఎం నిర్వహించాలి.
ప్రతి నెలా మూడో శనివారం తరగతుల వారీగా పీటీఎం సమావేశం నిర్వహించాలి. పిల్లల విద్యాపరమైన పురోగతి, హాజరు, పిల్లల ప్రవర్తన, చదువుల మూల్యాంకనం ఇతర అంశాలను తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులతో చర్చిస్తారు.
పిల్లల చదువు, పరీక్షల ఫలితాలు తెలుసుకోవడంతో పాటు మధ్యాహ్న భోజనం అమలు తీరును తల్లిదండ్రులు స్వయంగా పర్యవేక్షించవచ్చు. దీంతో నాణ్యత మెరుగుపడే అవకాశమున్నది.
చర్చించే అంశాలు..
పీటీఎంలో విద్యార్థుల చదువుతో పాటు ఆటపాటల్లో ప్రతిభను తెలుసుకోవచ్చు.
‘మనఊరు-మనబడి’, ఆంగ్ల మాధ్యమం అమలుపై తల్లిదండ్రులు తెలుసుకొని ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేయొచ్చు.
విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు సిద్ధం చేయడం.
సమావేశంలో చర్చించిన అంశాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రికార్డ్ చేసి మినిట్స్ తయారు చేయాలి.
తయారు చేసిన అంశాలను ఉన్నతాధికారులకు (ఎంఈవో, డీఈవో) పంపించాలి. దీంతో పాఠశాలల్లో సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది.
అధికారుల బాధ్యతలు..
నిరంతరం పాఠశాలలను అధికారులు పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాలకు కొన్నింటి ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే విద్యసంవత్సరంలోని అంశాలను పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యం అమలు చేసేలా చూడాలి.
ఫొటోలు, నివేదికను పంపించాలి..
విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం పీటీఎం నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో చర్చించిన అంశాల నివేదికను మండల విద్యావనరుల కేంద్రంలో సమర్పించాలి. మీటింగ్ ఫొటోలు విధిగా ఉన్నతాధికారులకు పంపించాలి. పీటీఎంను అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంది.
– రమేశ్‌కుమార్, మెదక్ జిల్లా విద్యాధికారి