మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్ 3 : ఆ ఊరికి గణేశ్ ఉత్సవాలు అత్యంత ప్రీతికరం.. వినాయక ఉత్సవాలను మిగతా ఊర్ల కంటే విభిన్నంగా నిర్వహిస్తున్నది. వేడుకలు జరిగినన్ని రోజులు ఊరు విడిచిపెట్టి పోరు. వేరే వాళ్లను రానివ్వరు. మద్యం, మాంసాలకు దూరంగా ఉంటారు. చివరికి సంసార జీవితాన్ని త్యజిస్తారు. ఆ ఊరే పిట్టలగూడెం. మద్దూరు మండలం నర్సాయపల్లి శివారు పిట్టలగూడెంలో సుమారు 50 కుటుంబాలున్నాయి. వీరంతా వారి ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా ప్రతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటాయి. వారి కుల దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ తల్లి పండుగలతో పాటు గణనాథుని నవరాత్రి ఉత్సవాలను ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తాయి. ప్రధానంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను గూడెం ప్రజలంతా సమష్టిగా అత్యంత నియమ నిష్టలతో విభిన్నంగా జరుపుకుంటుంది.
మద్యం, మాంసాలకు దూరం..
వినాయక చవితికి రెండు మూడ్రోజుల ముందే గూడెం ప్రజలంతా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మి ది రోజులు గూడెం ప్రజలంతా నియమ నిష్టలను పాటించాలని తీర్మానించుకుంటారు. ప్రధానంగా గూడెం ప్రజలంతా మద్యం, మాంసానికి దూరంగా ఉండడంతో పాటు సంసార జీవనానికి దూరంగా సోదరి, సోదర భావంతో మెలగాలని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా నిర్ణయించుకోవడే కాకుండా నియమ, నిష్టలను కఠినంగా ఆచరిస్తారు. కొత్త వ్యక్తులు కూడా గ్రామంలో మద్యం తాగి గానీ, మాంసం తిని గానీ రావద్దని చెబుతారు. ఇలా పదేండ్లుగా అత్యంత కఠినమైన నియమ నిష్టలతో గణనాథున్ని పూజిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పిట్టలగూడెం వాసులు. మరీ ముఖ్యంగా అయ్యప్ప, ఆంజనేయస్వామి దీక్షల మాదిరిగానే పిట్టలగూడెం యువకులు తొమ్మిది రోజుల పాటు గణేశ్‌ని దీక్షలను తీసుకుంటారు. ఈ దీక్ష సమయంలో దీక్షాపరులు గణనాథుని మండపం వద్దే వంటలు చేసుకొని, ఒకే పూట భోజనం చేస్తారు. అక్కడే నిద్రిస్తారు. కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోరు. ప్రతి రోజు రాత్రి గూడెం ప్రజలంతా గణపతి మండపం వద్దకు చేరుకొని భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తీరొక్క పండ్లతో ‘నిమజ్జన వాహనం’
తొమ్మిది రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో పూజలు చేసిన పిట్టలగూడెం వాసులు తొమ్మి దో రోజు గణనాథుని విభిన్నరీతిలో నిమజ్జనం చేస్తారు. ప్రత్యేకంగా పిట్టలగూడెం వాసులు ప్రస్తు తం పూలు, పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అందుకు ప్రతీకగా నిమజ్జనం రోజు గణనాథుని విగ్రహాన్ని ఊరేగించే వాహనాన్ని సుమారు రూ. 50వేల విలువ చేసే తీరొక్క పండ్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. తీరొక్క పండ్లతో అలంకరించిన వాహనంలో గణనాథుడి విగ్రహాన్ని ఊరేగించి స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. వాహనానికి అలంకరించిన పండ్లను ప్రసాదంగా భక్తులకు పంచిపెడుతారు.
తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో..
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఎం తో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. పొద్దున, సాయంత్రం వేళల్లో మండ పం వద్ద వినాయకునికి మహిళలమం తా రకరకాల నైవేద్యాలను పెట్టి పూజలు చేస్తా రు. నిమజ్జనం రోజు పండ్లతో బండిని అలంకరించి, ఊరేగిస్తాం. ఈ ఆచారం ఈ ఏరియాలో ఎక్కడా లేదు.
– తుమ్మల రజిత, మాజీ సర్పంచ్
పదేండ్లుగా ఉత్సవాలు..
మా గూడెంలో పదేండ్లుగా గణేశ్‌ని ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దేవున్ని పూజించేందుకు మేమంతా కొన్ని నియమ నిష్టలను పెట్టుకున్నాం. ఈ తొమ్మిది రోజుల పాటు ఏ ఒక్కరూ కూడా నియమ నిష్టలను తప్పరు. గూడెం ప్రజలంతా కలిసి సమష్టిగా పండుగను జరుపుకుంటాం. ఇలా జరుపుకోవడం మాకు చాలా బాగుంది.
– తుమ్మల అశోక్, స్థానికుడు, పిట్టలగూడెం
ఏటా గణేశ్ దీక్షలను తీసుకుంటాం..
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా యూత్ సభ్యులమంతా ఏటా గణేశ్ దీక్షలను తీసుకుంటాం. తొమ్మిది రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండి, మం డపం వద్దనే వంట చేసుకొని, ఒంటి పూట భోజనం చేస్తాం. 24 గంటలు స్వామి సన్నిధిలోనే ఉంటూ పూజలు చేస్తాం. ఈ విధంగా ఉండడం మాకు ఎంతో ఇష్టం.
– కాలియ నరేశ్, శివశక్తి యంగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు, పిట్టలగూడెం