నర్సాపూర్, సెప్టెంబర్ 3: ఐదు రోజుల పాపను రూ.40 వేలకు విక్రయించిన ఉదంతం నర్సాపూర్ మండలంలోని తుకారాం తండాలో శనివారం చోటుచేసుకున్నది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుకారాం తండాకు చెందిన హలావత్ లలిత నాల్గో సంతానంగా పాప జన్మించింది. నర్సాపూర్లోని ఒక ప్రైవేటు వసతి గృహం నిర్వాహకురాలు వెట్టిశెట్టి నాగమణి మధ్యవర్తిత్వంతో రూ.40 వేలకు ఆగస్టు 30న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్టణానికి చెందిన ఎల్లపు మూర్తికి విక్రయించేందుకు శివలక్ష్మి మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈ విషయం తెలిసిన ఐసీడీఎస్ సూపర్వైజర్ సరళకుమారి నర్సాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాపను అమ్మిన, కొన్న, మధ్యవర్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
శిశువుల క్రయవిక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి అనిత హెచ్చరించారు. శనివారం నర్సాపూర్లోని కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి అనిత విలేకరులతో మాట్లాడారు. మండలంలోని తుకారాం తండాలో 5 రోజుల శిశువును రూ.40 వేలకు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నేటికీ ఆడపిల్లలను అమ్మడం విచారకరమన్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఇప్పటికే బాధితులపై కేసులు నమోదు చేశామన్నారు. సంబంధించిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పాప అమ్మకాన్ని గుర్తించి చర్యలు తీసుకున్న ఐసీడీఎస్ సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో హేమాభార్గవి, సూపర్వైజర్ సరళకుమారి, న్యాయవాదులు పాల్గొన్నారు.