మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 3: అతి వేగం ప్రమాదకరమని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని మెదక్ జిల్లా న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్ర తా జీవన ప్రమాణాలు అనే అంశంపై మండల న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో జిల్లా రవా ణా శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు ఆటో డ్రైవర్లు, పాఠశాల విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ర్యాలీ ఆర్టీవో కార్యాలయం నుం చి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ద్వారా చోటుచేసుకుంటున్నాయని అన్నారు. వాహనదారులు మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపొద్దన్నారు. కొంతమంది వాహనదారులకు సరైన అవగాహన లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
మూల మలుపుల వద్ద సురక్షితంగా నడపాలని లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఆటోల్లో స్వామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం మంచిది కాదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. మైనార్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి వాహనానికి, డ్రైవర్‌కు బీమా సౌకర్యం ఉండాలన్నారు. ఫిట్నెస్ లేనిదే వాహనం రోడ్డుపైకి తీసుకురావద్దని సూచించారు. నేడు రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలో ప్రతి రోజు 50 కేసులు మద్యం తాగి వాహనాలు నడిపేవే ఉంటున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాదం జరిగితే న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జ్యుడీషియల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కల్పన మాట్లాడుతూ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మెదక్ డీఎస్పీ సైదులు మాట్లాడుతూ వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సుభాశ్‌గౌడ్, కరుణాకర్, ఎంవీఐలు రిచర్డ్స్, క్రిష్టఫర్, పట్టణ సీఐ మధు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 3: ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంగారెడ్డి జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జి.సుదర్శన్ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి ఐబీ వరకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా న్యాయమూర్తి సుదర్శన్ ప్రారంభించి, మాట్లాడారు. వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు, సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మద్యం తాగి, సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాలీలో సంగారెడ్డి పట్టణ సీఐ రమేశ్, ట్రాఫిక్ సీఐ రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్టీఏ అధికారి శ్రీనివాస్, యువజన సంఘాల అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.
పన్ను రద్దు చేసిన ప్రభుత్వం
ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృ ష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభు త్వం పన్ను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం బ్యాడ్జ్ విధానాన్ని తీసివేసింది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహన లైసెన్స్ పొందిన వారూ ట్రాన్స్పోర్ట్ వాహనం నడపొచ్చు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా పెట్టుకోవాలి. రోడ్డు భద్రతపై ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహిస్తున్నాం.
– శ్రీనివాస్‌గౌడ్, జిల్లా రవాణాధికారి మెదక్