తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్ 1: సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిరుపేదలకు వరంలా మారింది. పైసా ఖర్చు లేకుండా నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతికేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. 2017లో సీఎం కేసీఆర్ తూప్రాన్ పట్టణంలోని సామాజిక దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా తూప్రాన్ పట్టణానికి 500ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2018లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 504 ఇండ్లు మంజూరవ్వగా 400 ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 104 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
నేడు ప్రారంభించనున్న మంత్రి : నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 400ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
పారదర్శకంగా‘డబుల్’ ఎంపిక : ఎఫ్డీసీ చైర్మన్
అవినీతికి తావులేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక ఉంటుందని, అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లను కేటాయించనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తూప్రాన్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇండ్లు లేని నిరుపేదలకు తూప్రాన్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను గురువారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 504 డబుల్ బెడ్రూమ్లకు 400ల డబుల్ బెడ్రూమ్లను నేడు మంత్రి హరీశ్ రావు పంపిణీ చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యం రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ జ్ఞాన జ్యోతి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మండ లాధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ వీర కుమార్ గౌడ్, ఆర్ఐలు నగేశ్, జై భారత్ రెడ్డి పట్టణవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంత్రి పర్యటన ఇలా..
ఉదయం 9 గంటలకు మనోహరాబాద్ మండల కేంద్రానికి చేరుకుని అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన.
9.30 గంటలకు కమ్యూనిటీహాల్, అంగన్వాడీ కేంద్రం, గ్రంథాలయాలకు శంకుస్థాపన. తదనంతరం 9.45 నిమిషాలకు ఆసరా పింఛన్ల పంపిణీ.
10.45 నిమిషాలకు తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఆసరా పింఛన్ల పంపిణీ.
11.45 నిమిషాలకు తూప్రాన్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభించనున్నారు.
12.30 గంటలకు తూప్రాన్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.
మధ్యాహ్నం 1.30 గంటలకు తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తాలో రూ. 10.30 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను ప్రారంభించి అక్కడ నుంచి చేగుంట వెళ్తారు.