మెదక్(నమస్తే తెలంగాణ) /కొల్చారం, సెప్టెంబర్ 1 : భార్యాభర్తల హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. గురువారం మెదక్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన నిమ్మగారి లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ దంపతులు, గత నెల 23న రంగంపేటలోని ఓ బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసుకొని ఇంటికి వెళ్లారు. అయితే పైతర గ్రామానికి చెందిన ఎర్రం శంకర్, మిద్దె యాదయ్య, పుట్టి జగన్ భార్యాభర్తలిద్దరిని హత్య చేస్తే వారి వద్ద ఉన్న డబ్బులు, నగలు తీసుకోవచ్చని పథకం పన్నారు. ఆగస్టు 23న రాత్రి లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లి దంపతులను గొడ్డలితో హత్య చేశారు. వారి వద్ద ఉన్న రూ.30వేల నగదుతో పాటు లక్ష్మమ్మ ఒంటిపైన ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, చెవి కమ్మలను తీసుకొని పారిపోయారు.
24న గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. ఈ మేరకు లక్ష్మారెడ్డి కూతురు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదార్తో పాటు ఎస్సైలు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని చుట్టు పక్కల ప్రాంతాల వ్యక్తులను కూడా విచారించారు. ఒక్కొక్కరినీ విచారించడంతో అందులో ముగ్గురు వ్యక్తులు పైతర గ్రామానికి చెందిన ఈరం శంకర్, యాదయ్య, జగన్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ముగ్గురిని విచారించగా, భార్యాభర్తలను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. నిందితులు చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించడానికి పథకం పన్నారు.
లక్ష్మారెడ్డి, అతడి భార్య లక్ష్మమ్మ వద్ద చాలా డబ్బులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని ముగ్గురూ కలిసి మద్యం తాగి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని హత్య చేయాలని పథకం పన్నారని పోలీసులు వెల్లడించారు. హత్యకు వాడిన కత్తులు, గొడ్డలి గోనె సంచిలో వేసి బావిలో పడేశారు. ఈ మేరకు ముగ్గురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4వేల నగదు, బంగారు ఆభరణాలను, గొడ్డలి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసును వారం రోజులో ఛేదించిన మెదక్ డీఎస్పీ సైదులు, సీఐలు విజయ్, లాల్మదార్ కానిస్టేబుళ్లను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అభినందించారు. సమావేశంలో మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ విజయ్, టౌన్ సీఐ మధు, నర్సాపూర్ సీఐ లాల్ మదార్ ఎస్సైలు శ్రీనివాస్‌గౌడ్, మోహన్‌రెడ్డి, విజయ్ నారాయణ్, మురళీ, కానిస్టేబుళ్లు ఉన్నారు.