సంగారెడ్డి/మెదక్, (నమస్తే తెలంగాణ) ఆగస్టు 29 : దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన దళితులు నేడు ప్రగతి బాటలో పరుగులు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం వీరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒకప్పుడు కూలీలుగా, జీతగాళ్లుగా పనిచేసిన వాళ్లు ప్రస్తుతం యజమానులుగా మారి నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందించిన రూ.10లక్షల సాయంతో నచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. దళితబంధు పథకం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విజయవంతంగా అమలవుతుండగా, లబ్ధిదారులకు అధికారులు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మెదక్‌లో మొత్తం 256 యూనిట్లు మంజూరు కాగా, రూ. 24 కోట్ల 50 లక్షలతో 255 ఇప్పటికే పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాకు 444 యూనిట్లు ప్రకటించగా, ఇప్పటి వరకు 359 గ్రౌండింగ్ పూర్తయ్యాయి. మరో 85 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు రెండో విడత దళితబంధు అమలుపై సర్కార్ దృష్టిసారించింది. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి మరికొంత మందికి సాయం అందించనున్నది.
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు దళితులవి. అణచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ బతుకు పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులు సాధికారత సాధించినప్పుడే నిజమైన విజయమని సీఎం కేసీఆర్ భావించారు. ధనవంతులైన దళితులను తెలంగాణలో చూడాలన్నదే.. సీఎం కేసీఆర్ సంకల్పం. దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతకాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే ‘దళితబంధు’ చారిత్రాత్మక దళిత బంధు పథకం మెదక్, సంగారెడ్డి జిల్లాలో దిగ్విజయంగా అమలవుతోంది. ఈ పథకంలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతున్నది. మెదక్ జిల్లాలో మొత్తం 256 యూనిట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 140 యూనిట్లకు సంబంధించి డెయిరీ షెడ్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పాడి గేదెలు తదితర ఉపాధికి సంబంధించినవి ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూనిట్ల గ్రౌండింగ్ జరుగుతున్నది.
మెదక్ జిల్లాలో 256 మంది లబ్ధిదారులు..
మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలతో పాటు గజ్వేల్, అందోల్, దుబ్బాక, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 256 మందికి దళితబంధు అవకాశం దక్కింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే అందోల్ నియోజకవర్గంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 256 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి యూనిట్లను అందజేశారు. నియోజకవర్గాల్లో వందకు మించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అసాధ్యంగా మారింది. దీంతో కొన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసి మిగతా వారికి రెండో విడతలో అవకాశం కల్పించనున్నారు. మొదటి విడతలో మెదక్ నియోజకవర్గంలోని హవేళీఘనపూర్ మండలం జక్కన్నపేటలో 20 మంది లబ్ధిదారులు, మెదక్ మండలంలో కొంటూర్లో 20 మంది, నిజాంపేట మండలం రాంపూర్‌లో 18 , పాపన్నపేట మండలం అబ్లాపూర్లో 18 , రామాయంపేట మండలం శివ్వాయిపల్లిలో 7, చిన్నశంకరంపేట మండలం చందంపేటలో 17 మొత్తం 100 మందిని ఎంపిక చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడిపల్లి మండలం వెంకటాపూర్ బీలో 34, చిలిపిచెడ్ మండలం రాందాస్‌గూడలో ఇద్దరు, నర్సాపూర్ మండలం తిర్మలాపూర్‌లో 21, శివ్వంపేట మండలం తిమ్మాపూర్‌లో 18, వెల్దుర్తి మండలం రామంతాపూర్‌లో 23, బండమీదిపల్లిలో ఇద్దరిని ఎంపిక చేశారు. అందోల్ నియోజకవర్గంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మొత్తం 256 మంది లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకోగా, ఒక్కరికి మాత్రమే దళితబంధు యూనిట్‌ను అందజేయలేదు.
అందోల్ నియోజకవర్గంలో 56 యూనిట్లు పంపిణీ
అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలంలోని అసద్ మహ్మద్పల్లి గ్రామంలోని దళితులకు 56 యూనిట్లు మంజూరు కాగా, వాటిన్నింటినీ గ్రౌండింగ్ చేశారు. ఇందులో ఎక్కువగా 13 డెయిరీలను ఏర్పాటు చేసుకోగా, ఆరు ట్రాక్టర్లు, ఒక హార్వెస్టర్, మూడు అశోక్ లీలాండ్, ఐదు గొర్రెలను, ఒకటి మినీ సూపర్ బజార్, ఒక ఫర్టిలైజర్స్ షాపు, మూడు పౌల్ట్రీఫాంలు, మూడు బట్టల దుకాణాలు ఇలా రకరకాల ఉపాధిని ఇచ్చే యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో..
నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం 100 యూనిట్లు మంజూరు కాగా, 94 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందు లో 15 యూనిట్లు డెయిరీఫాంలు కాగా, 10 పౌల్ట్రీ ఫాంలు, 4 గొర్రెల యూనిట్లు, ట్రాన్స్‌ఫోర్ట్ కింద 38 యూనిట్లు, ఆర్సీసీ రూఫ్ మేకింగ్ 7, హార్వెస్టర్లు 5, ఇతర దుకాణాలు 17లను ఏర్పాటు చేసుకున్నారు.
మెదక్ నియోజకవర్గంలో..
మెదక్ నియోజకవర్గంలో మొత్తం 100 యూనిట్లు మంజూ రు కాగా, ఇప్పటి వరకు 81 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఇందులో డైరీ 30, పౌల్ట్రీ 10, దుకాణాలు 30, ట్రాన్స్‌పోర్టు వాహనాలు 13, హార్వెస్టర్లు 2, డిజిటల్ ల్యాబ్ 1, ఫుడ్ అండ్ రెస్టారెంట్ 1, ఇతర వ్యాపారం పొందే 3 యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాకు మంజూరైన 444 యూనిట్లలో ఇప్పటి వరకు 359 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి అయ్యింది. 85 యూనిట్ల గ్రౌండింగ్ కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో దళిథబంధు పథకం విజయవంతమయ్యేలా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరువ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి సకాలంలో లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.
మినీ డెయిరీలకు అధిక డిమాండ్
జిల్లాలో మొత్తం 444 యూనిట్లుకుగానూ 359 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. దళితబందు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఎక్కువగా మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తిచూపుతున్నారు. సాగుభూమి ఉన్న దళితబంధు లబ్ధిదారులు ఈజీఎస్ ద్వారా మినీ డెయిరీ ఏర్పాటుకు షెడ్లు వేసుకుంటున్నారు. ఆ తర్వాత దళితబంధు డబ్బులతో తమిళనాడు వెళ్లి పాలు ఇచ్చే ఆవులు, గేదెలను తీసుకొచ్చి తమ గ్రామాల్లో మినీ డెయిరీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాకు 130 మినీ డెయిరీలు మంజూరు కాగా ఇప్పటి వరకు 68 మంది లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో గ్రౌండింగ్ పూర్తయిన 359 యూనిట్లకుగాను 120 వాహనాలు, 57 ట్రాక్టర్లు, 15 జేసీబీలు లబ్ధిదారులకు అందజేశారు. గొర్రెల యూనిట్లు ఏడు, నర్సరీలు ఐదు, సెంట్రింగ్ యూనిట్లు 29 గ్రౌండింగ్ పూర్తి చేశారు. ఇదిలా ఉంటే రెండో విడత దళితబంధు పథకం అమలుపైనా అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు 70 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేసిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి బాబూరావు తెలిపారు.
సీఎం సారూ.. ఆర్థిక భరోసా కల్పించిండు
వెల్దుర్తి ః కూలీ పనులు చేసుకుంటూ బతుకులు వెళ్లదీసే మాకు సీఎం కేసీఆర్ సారూ ఆర్థిక భరోసా కల్పించిండు. నా కొడుకు మహేందర్ వ్యవసాయం చూసుకుంటూ కూలీకి వెళ్లేవాడు. ఎలాంటి ఉపాధి లేని మాకు సీఎం సారు కల్పించిన దళితబంధుతో కారు కొనుక్కుని కిరాయికి నడుపుతున్నాం. దీంతో నెలకు రూ. 12 నుంచి 15 వేల వరకు ఆదాయం వస్తుంది. కారుకు ఎలాంటి కిస్తీలు కానీ, అప్పు మిత్తీలు కాని కట్టేది లేదు. దీంతో వచ్చే ప్రతి రూపాయి మాకే దక్కుతుంది. కొడుకుకు పని దొరికింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సార్లకు రుణపడి ఉంటాం.
–ముక్క పోచమ్మ, దళితబంధు లబ్ధిదారుడు,రామంతాపూర్
కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తున్నా..
గుమ్మడిదల ; దళితబంధు ద్వారా వచ్చిన బొలెరో మ్యాక్స్ పికప్ ట్రాలీ బండితో మా ప్రాంతంలో రైతులు పండిస్తున్న కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తున్నా.. మా గ్రామంలో ధాన్యం, వస్తువులను రవాణా చేస్తూ నాలుగు రూపాయ లు సంపాదిస్తున్నా. మా వెనుకబడిన కులాలకు సీఎం కేసీఆర్ సార్ దళితబంధు పెట్టడంతో మా కాళ్లపై మేము నిలబడుతున్నం. ఇలాంటి పథకాన్ని సీఎం సార్ ప్రవేశ పెట్టడంతో దళితజనులకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇంతమంచి సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు సీఎం సార్‌కు రుణపడి ఉంటాం.
–రామగళ్ల అశోక్, దళితబంధు లబ్ధిదారుడు, అనంతారం
ట్రాలీ ఆటోతో ఉపాధి పొందుతున్నా..
జిన్నారం; దళిత బంధు పథకం ద్వారా వచ్చిన డబ్బుతో అశోక్ లీలాండ్ పెద్ద సైజ్ ట్రాలీ ఆటో కొన్నా. ట్రాలీ ఆటోకు రోజు కిరాయిలు వస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నా. అంతకు ముందు చిన్న చిన్న పనులు చేసుకున్నాం. ట్రాలీ ఆటోతో కుటుంబానికి ఉపాధి లభించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన దళిత బంధుతో మా కటుంబానికి చాలా మేలు చేసింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
– శివకుమార్, కొడకంచి
భవిష్యత్‌కు భరోసా ..
వెల్దుర్తి ః మాలాంటి పేదోళ్ల బతుకులకు సీఎం కేసీఆర్ సారు దళితబంధుతో భరోసా కల్పించారు. భర్త లేడు, ఇద్దరు కూతుళ్లు, ఒక్క కొడుకు. ఉన్న ఒక్క ఎకరం పొలం సాగు చేస్తూ, కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. సీఎం సారు ఇచ్చిన దళితబంధుతో బొలెరో మ్యాక్స్ పికప్ ట్రాలీని తీసుకున్నా. నెలకు అన్ని ఖర్చులు పోను రూ. 12 వేలు మిగులుతున్నాయి. ఎలాంటి అప్పులు కట్టేది లేకపోవడంతో వచ్చిన ప్రతి రూపాయికి మాకే వస్తుంది. ఉపాధి కల్పించి, మా కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– ముక్క మైసమ్మ, దళితబంధు లబ్ధిదారు, రామంతాపూర్