మెదక్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలని అత్యధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమానికి 66 వినతులు రాగా, అందులో 40 వినతులు డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరుకు వచ్చాయి. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో వెయ్యి ఇండ్లు మంజూరుకు 500 మంది లబ్ధిదారులకు అందజేశామని, త్వరలో అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి మిగిలిన మరో 500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఆసరా పింఛన్ల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పింఛన్ మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ప్రజావాణిలో రేషన్ కార్డుల మంజూరు, భూ సమస్యలు తదితర ఫిర్యాదులకు సంబంధించి 26 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఎస్వో శ్రీనివాస్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఎస్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు గంగయ్య, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
–మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, ఆగస్టు 29 : అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.