మెదక్ మున్సిపాలిటీ, ఆగష్టు 28: మాతృదినోత్సవం.. పితృదినోత్సవం.. ఇలా అన్నింటికీ ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే కోవలో క్రీడారంగానికి సైతం పండుగ రోజు ఉంది. మూడు దశాబ్దాల పాటు క్రీడారంగాన్ని శాసించి ప్రపంచ క్రీడాగ్రాప్ చెరపలేని రికార్డులు లిఖించిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్. ఆయన జయంతి ఆగస్టు 29. ఈ రోజున ప్రతి ఏడాది జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు. మేజర్ ధ్యాన్‌చంద్ వరుసగా మూడుసార్లు దేశ హాకీకి ప్రాతినిథ్యం వహించి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు అందించారు.
అంతర్జాతీయ హాకీలో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన ధన్యజీవి ధ్యాన్‌చంద్. ఒలింపిక్స్‌లో పుష్కరకాలం పాటు భారత్‌ను స్వర్ణ విజేతగా నిలిపిన అసాధారణ ఆటగాడు. భారత హాకీకి విశేష సేవలందించాడు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు. ఈ రోజునే ఉత్తమ క్రీడాకారులకు భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘ద్రోణాచార్య’, ‘రాజీవ్ ఖేల్ రత్నా’( రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును ఈ సంవత్సరం నుంచి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా అవార్డుగా కేంద్ర ప్రభుత్వం మార్చింది) లాంటి అవార్డులు, పురస్కారాలు ఇచ్చి గౌరవ సన్మానం చేస్తున్నది.
ధ్యాన్‌చంద్ 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ధ్యాన్‌చంద్ ప్ర పంచంలోనే అత్యుత్తమమైన ఫార్వర్డ్ ఆటగాడిగా గుర్తింపు పొం దాడు. బంతిని డ్రిబ్లింగ్ చేస్తున్నప్పుడు హాకీ స్టిక్, బంతి రెండు అతుక్కుని పోయాయా అన్న భ్రమ కలిగించే విధంగా క్రీడా నైపుణ్యం ప్రదర్శించే వాడని ఒక సందర్భంలో విదేశీయులు ఆయన స్టిక్‌లో అయస్కాంతం ఉందా అని స్టిక్‌ను విరిచి చూడటం ధ్యాన్‌చంద్ క్రీడా నైపుణ్యానికి అద్దం పడుతుంది.
ధ్యాన్‌చంద్ 1922లో భారత ఆర్మీలో చేరి 1926లో భారత సైనిక హాకీకి ప్రాతినిథ్యం వహించాడు. 1928, 1932, 1936 ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీకి వరుస స్వర్ణ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 1934లో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1948లో ధ్యాన్‌చంద్ హాకీ నుంచి రిటైర్డ్ అయ్యాడు. 1930లో భారత జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించి 48 మ్యాచ్‌లు ఆడి 584 గోల్స్ చేయగా.. ఇందులో 201 గోల్స్ ధ్యాన్‌చంద్ వ్యక్తిగతంగా చేసినవే. వ్యక్తిగతంగా 201 గోల్స్ చేసి ప్రపంచ చరిత్ర పూటల్లో పేరు సంపాదించుకున్నాడు.
ధ్యాన్‌చంద్ 64వ ఏట అనారోగ్యంతో మృతి చెందాడు. 1979 డిసెంబర్ 3న తుదిశ్వాస విడిచాడు. ఈ హాకీ దిగ్గజం మరణానంతరం అతని జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 22 ఏండ్ల పాటు హాకీకి సుదీర్ఘ సేవలు అందించడమే కాకుండా జట్టుకు గుండెకాయగా ధ్యాన్‌చంద్ నిలిచాడు.
1948లో తన చిట్టచివరి అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ఆడిన ధ్యాన్‌చంద్‌కు 1956లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. ధ్యాన్‌చంద్ మరణానంతరం ఆయన పేరుతో న్యూఢిల్లీలో నేషనల్ స్టేడియాన్ని నిర్మించారు. ధ్యాన్‌చంద్ పేరుతో ఓ తపాలా బిళ్లను సైతం విడుదల చేయడంతో పాటు క్రీడారంగంలో జీవనసాఫల్య పురస్కార గ్రహీతలకు ఇచ్చే మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డును సైతం ప్రవేశ పెట్టారు. ధ్యాన్‌చంద్ మరణానంతరం భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ క్రీడాకారులు, క్రీడాభిమానుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. వివిధ రంగాలకు చెందిన 48 మంది ప్రముఖులు ఇప్పటి వరకూ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ధ్యాన్‌చంద్‌కు మాత్రం భారతరత్న దక్కడం లేదు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన ధ్యాన్‌చంద్ హాకీలో ప్రపంచంలో భారత దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చాడు. దేశంలో ప్రతి గ్రామంలో హాకీని అభివృద్ధి చేస్తేనే ధ్యాన్‌చంద్‌కు నివాళి. ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్‌లో ప్రతి మ్యాచ్ విజయాన్ని కోరుకున్నారు. ధ్యాన్‌చంద్ చూపిన ప్రతిభ వల్లే హాకీ ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందింది. ప్రతి క్రీడాకారుడు రాణించి ధ్యాన్‌చంద్ ఆశయం నెరవేర్చాలి. – మధుసూదన్,
అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మెదక్
హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి. తన క్రీడ నైపుణ్యంతో దేశానికే వన్నె తెచ్చాడు. ప్రతి క్రీడాకారుడు జీవితంలో క్రీడలు ఒక భాగమనే స్ఫూర్తి, పట్టుదల, కృషితో ముందుకెళ్లాలి. ధ్యాన్‌చంద్ మరణానంతరం భారతరత్న అవార్డు ఇవ్వలంటూ క్రీడాకారులు, క్రీడాభిమానుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ధ్యాన్‌చంద్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలి.
– జుబేర్, మెదక్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుడు