కొమురవెల్లి, ఆగస్టు 28 : పేదల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అడ్డుపడితే తరిమికొడతామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం కొమురవెల్లి మండల కేంద్రంలోని పద్మశ్రీ గార్డెన్లో ఎంపీపీ తలారి కీర్తనాకిషన్ అధ్యక్షతన జరిగిన నూతన పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 606 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇది ఓర్వలేని మోదీ సంక్షేమ పథకాలు బంద్ చేయాలంటున్నారన్నారు.
సంక్షేమ పథకాలు వద్దంటున్న మోదీ, బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఇంకా ఎవరైనా గ్రామాల్లో అర్హులు ఉంటే వారికి పింఛన్ వచ్చేలా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఇటీవల మృతి చెందిన గురువన్నపేటకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు పబ్బొజు ఆగాచారి కుటుంబ సభ్యులకు తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి మంజూరైన రూ.లక్షా30 వేల చెక్కును టీఆర్ఎస్ కార్మిక విభాగం నాలుగు మండలాల ఇన్చార్జి గణేశ్‌తో కలిసి అందజేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, వైస్ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, స్థానిక సర్పంచు సార్ల లత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సాయిమల్లు, మండల కో ఆప్షన్ సభ్యుడు లాల్భగన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.