చిన్నశంకరంపేట, ఆగస్టు25: అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి, హత్య చేసిన ఘటన మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శాలిపేట గ్రామానికి చెందిన యాదగిరిగౌడ్ (28), తల్లి, తమ్ముడుతో కలసి గవ్వలపల్లిలో నివసిస్తూ ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. నిత్యం యాదగిరిగౌడ్కు మద్యం తాగే అలవాటు ఉంది.
దీంతో ఇంట్లో గొడవలు సృష్టించేవాడు. బుధవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంట్లోకి వచ్చి తమ్ముడితో గొడవపడ్డాడు. దీంతో తమ్ముడు అంజాగౌడ్, గవ్వలపల్లి చౌరస్తా సమీపంలో యాదగిరిగౌడ్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 90 శాతం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ దవఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.