ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి స్పష్టంగా కనిపించాలని, పది రోజుల్లో క్రీడాప్రాంగణాలు పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం నిర్వహణ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడాప్రాంగణాలు తదితర అంశాలపై డీఎల్పీవోలు, ఆర్డీవోలు, ఎంపీవోలతో కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజూ తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించి, ఎరువు తయారు చేసి విక్రయించాలని, అంతటా ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం ఉండాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 25: సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న క్రీడా ప్రాంగణాలను పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఎల్పీవోలు, ఆర్డీవోలు, ఎంపీవోలతో పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి స్పష్టంగా కనిపించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని విషయాలపై ప్రజలను చైతన్యం చేయాలని ఎంపీవోలకు సూచించారు. ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం ఉండాలని వివరించారు. ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, పొడి చెత్తను గ్రామ పంచాయతీ వారీగా ఏజెన్సీతో ఒప్పందం చేసుకొని అమ్మాలను స్పష్టం చేశారు.
తడి చెత్తను సెగ్రిగేషన్ చేసి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని వివరించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం సెగ్రిగేషన్ జరగాలన్నారు. గ్రామంలో ఎక్కడ చెత్త కనిపించరాదని హితవు చేశారు. చెత్త నుంచి ఆదాయం వచ్చేవిధంగా ప్రణాళిక చేయాలని ఎంపీవోలకు సూచించారు. దాతల సహకరంతో 4 లేదా 5 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక బాడీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వైకుంఠధామంలో వైకుంఠ రథం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వైకుంఠధామం ప్రహరీపై స్లోగన్లు రాయించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంలో గ్యాప్స్ ఫిల్ చేయాలన్నారు.
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో వీలైనంత ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం మూడు కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో 10 మొక్కలను దుకాణాల ముందు నాటాలని, దుకాణ యజమానులే మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి బాధ్యతగా పనులను నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీపీవో సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.