కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధిక శాతం మహిళలే చేయించుకుంటున్నారు. భయం, చిన్నతనం, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో కొంతమంది పురుషులు కు.ని. చికిత్సకు వెనుకడుగు వేస్తున్నారు. కుటుంబంలోని పెద్దలు సైతం ఇందుకు వత్తాసు పలుకుతుండడంతో చాలా కుటుంబాల్లో ఆడవాళ్లే బాధితులవుతున్నారు. వాస్తవానికి మగవారికి చేసే వెసెక్టమీ ఆపరేషన్ చాలా సులభం. కేవలం ఐదు నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తవుతుంది. గంటలోపు డిశ్చార్జి అవడంతో పాటు అన్ని పనులు చేసుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. భర్తలు ఆసక్తి చూపకపోవడంతో భార్యలు ట్యుబెక్టమీ చేయించుకోక తప్పడం లేదు. గతేడాది మెదక్ జిల్లాలో 3124 ఆపరేషన్లు జరుగగా, మొత్తం మహిళలే చేయించుకోవడం గమనార్హం. ప్రచారం కరువవడం, ప్రత్యేక క్యాంపులు, ప్రోత్సాహకాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తున్నది.
రూపానికి ఆకారాన్ని ఇచ్చే శక్తి అమ్మ.. పురిటి నొప్పుల బాధ పడుతూ ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణాన్ని తీసుకువస్తుంది. అలాంటి అమ్మపై పిల్లల పోషణతో పాటు కుటుంబ బాధ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. పురిటి నొప్పులతో కానీ, ఆపరేషన్లతో కానీ బిడ్డకు జన్మనిచ్చిన అమ్మ ఆరోగ్యం బాగుండాలనే కోరుకుంటాం అందరం. అలాంటి అమ్మ కుటుంబ నియంత్రణ బాధ్యత కూడా మోయక తప్పడం లేదు. పురుషులు సైతం ఈ ఆపరేషన్ చేసుకునే అవకాశం ఉన్నా, అవగాహన లేమి కారణంగా ‘ఆమె’పై నియంత్రణ భారం కూడా వేస్తున్నారు. మగవారు ముందుకు వచ్చి కు.ని ఆపరేషన్లు చేసుకుంటే మహిళలకు ఆరోగ్య సమస్యలు తగ్గి, వారి బాధ్యతలోనూ పాలుపంచుకున్నవారవుతారని చెబుతున్నారు వైద్యులు.
మెదక్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరు చెబితేనే మగవాళ్లు తుర్రుమంటున్నారు. అహంతో కొందరు.. అవగాహన లేక కొందరు భార్యలపైనే భారం మోపుతున్నారు. నిజానికి మహిళలకు ట్యుబెక్టమీలో భాగంగా 4, 5 అంగులాల మేర శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుంది. నేటికీ 99 శాతానికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. కుటుంబ నియంత్రణపై గతంతో పోలిస్తే ప్రజల్లో చైతన్యం వచ్చినా వెసెక్టమీకి పురుషులు ఎక్కువగా ముందుకు రావడం లేదు. ఏడాదిలో ఒక్కరు కూడా వెసెక్టమీ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మెదక్ జిల్లాలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి 2022 వరకు 1850 డీపీఎల్ (డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోప్) ఆపరేషన్లు చేయగా, సర్కారు దవాఖానల్లో 533, ప్రైవేట్ దవాఖానల్లో 741 మంది స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగగా, మొత్తం 3124 మంది చేయించుకున్నారు. ఏప్రిల్ 2022 నుంచి జూలై వరకు 381 డీపీఎల్, 252 ప్రభుత్వ దవాఖానలో, 255 ప్రైవేట్ దవాఖానల్లో ట్యుబెక్టమీ ఆపరేషన్లు జరిగాయి. అయితే ఏడాది మొత్తంలో ఒక్క పురుషుడు కూడా వెసెక్టమీ చేయించుకోలేదు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, అధికారుల నుంచి ప్రచారం కరువవడం, ప్రత్యేక క్యాంపులు, ప్రోత్సాహకాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
మహిళలతో పోలిస్తే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పురుషులకే సులభమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో గతంలో కోత విధానం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇందుకోసం అధునాతన పద్ధతులు వచ్చాయి. రెండు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలోనే వెసెక్టమీ పూర్తవుతుంది. గంటలోపల డిశ్చార్జి కావడంతో పాటు అన్ని పనులు సక్రమంగా చేసుకోవచ్చు. ఆరోగ్య పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు చెబుతున్నారు. అయినా అపోహలతో మగవాళ్లు ముందుకు రావడం లేదు. అంతేకాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మహిళలు తప్పనిసరిగా కు.ని ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోంది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. పురుషులు వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మూడు నుంచి ఐదు నిమిషాల్లోనే వెసెక్టమీ పూర్తవుతుంది. మగవారు ముందుకు రావాలి.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో మెదక్