మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 25: రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఇఫ్కో డైరెక్టర్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవేందర్‌రెడ్డితో పాటు అదనపు కలెక్టర్ రమేశ్ హాజరై, విజేతలకు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో లక్ష్య సాధనకు కష్టపడితే విజయం తప్పక సిద్ధిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని ఆశిస్తున్నారు కానీ, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలన్నారు. క్రీడల్లో రాణిస్తే పేరుతో పాటు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ బాక్సింగ్‌లో రాణించి తెలంగాణకే కాదు యావత్ దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్పీ ఉద్యోగం కల్పించిందన్నారు.
మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో మెదక్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే హైదరాబాద్ తరువాత మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో కబడ్డీ, వాలీబాల్ క్రీడల మైదానాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. క్రికెట్ మైదానం కోసం 10 ఎకరాల స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. స్టేడియం పక్కనే సుమారు 3 ఎకరాల భూమి ఉన్నదని, దాన్ని స్టేడియం పరిధిలోకి తెచ్చి మరిన్ని క్రీడలు ఆడేందుకు వీలుగా తయారు చేస్తానని అన్నారు.
పోటీలకు వచ్చే క్రీడాకారులు సుమారు వెయ్యి మందికి వసతి గృహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి ఆయన దృష్టికి తేగా, తప్పకుండా ఏర్పాటుకు ప్రయత్నిస్తానన్నారు. మెదక్ స్టేడియం నుంచి తరలిపోయిన సాయి అకాడమీ త్వరలో రాబోతున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, పీఈటీలను అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమేనన్నారు. క్రీడలతో అంకితభావం, క్రమ శిక్షణ అలవడుతాయని, మేధస్సు చురుకుగా పని చేస్తుందని, చదువుల్లోనూ రాణిస్తారని అన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎమ్మెల్యే, అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, పీఈటీల సహకారం ఉంటే ఈ స్టేడియంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించుకోవచ్చన్నారు.
1100 వందల మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లకు భోజన సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధు, డీఈవో రమేశ్‌కుమార్, రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫౌండర్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్‌రావు, పీఈటీలు శ్రీనివాస్‌రావు, సుజాత, నరేశ్, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు జుబేర్, సంగ శ్రీకాంత్, బోస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, పలువురు పాల్గొన్నారు.
జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అత్యధిక విజయాలతో 78 పాయింట్లు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా ఓవరాల్ చాంపియన్ షిప్‌ను సాధించింది. హనుమకొండ జిల్లా అండర్-20 బాలికలు 33 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా అండర్-18 బాలికలు 29 పాయింట్లు, భద్రాది కొత్తగూడెం జిల్లా అండర్-16 బాలురు 29 పాయింట్లు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఖమ్మం జిల్లా అండర్-19 బాలురు 21 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు.
మేడ్చల్ జిల్లా అండర్ -16 బాలికలు 19 పాయింట్లు, అండర్ -14 బాలికలు16 పాయింట్లు సాధించి ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఖమ్మం జిల్లా అండర్-14 బాలురు 11 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచారు. విజేతలు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జిల్లా ఆదనపు కలెక్టర్ రమేశ్ బహుమతులు అందజేశారు. గుంటూరులో జరగబోయే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు 84 మంది ఎంపికయ్యారు.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజినల్ లెవల్ అండర్-17 క్రికెట్ టోర్నీ గురువారం కంది మండలం ఎద్దుమైలారం (ఓడీఎఫ్) కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలను ఓడీఎఫ్ కేంద్రీయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసులు ప్రారంభించారు.
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 72 కేంద్రీయ విద్యాలయాలుండగా ఇందులో 7టీంలు పోటీల్లో పాల్గొన్నాయి. బేగంపేట్, గచ్చిబౌలి, నల్గొండ, గోల్కొండ, పికెట్, ఎద్దుమైలారం (ఓడీఎఫ్), విజయవాడ, రాజమండ్రి విద్యాలయాలకు చెందిన 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ కౌన్సిల్ క్రికెట్ బోర్డుకు చెంది న 8మంది జడ్జిల సమక్షంలో మ్యాచ్‌లు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులకు మూడేంళ్ల తర్వాత క్రీడా పోటీలు ఓడీఎఫ్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉత్సహంగా పోటీల్లో పాల్గొంటున్నారని, గెలుపొందిన టీంలకు మొదటి బహుమతి గోల్డ్ కప్, రెండో బహుమతి సిల్వర్ కప్‌లతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు మోడల్స్, షీల్డ్‌లను అందజేస్తామన్నారు.
29,30 తేదీల్లో అండర్ 14,17,19 విద్యార్థినీ, విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీప్ జనరల్ మేనేజర్ కే.సుధాకర్ విద్యాలయానికి అన్ని విధాల సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్-17 కిక్రెట్ పోటీల్లో గెలుపొందిన టీంలు నేషనల్ స్థాయికి వెళ్తాయన్నారు. కార్యక్రమంలో పీఈటీ దేవానంద్, ఉపాధ్యాయులు మల్లయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.