నారాయణరావుపేట, ఆగస్టు 25 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదని, ట్రబుల్ ఇంజిన్ అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఏద్దేవా చేశారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన విలేజ్ ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించి, మండలంలో మంజూరైన 569 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందించారు.
అనంతరం సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నారాయణరావుపేట మండల కేంద్రం నుంచి పెద్దలింగారెడ్డిపల్లి మీదుగా పుల్లూరు గ్రామం వరకు తారు రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణరావుపేట గ్రామపంచాయతీ భవనం, 24 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కోనయగారి సంఘం భవనం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వడ్డెర సామూహిక భవనం, ముదిరాజ్ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, ఎరుకల సంఘం భవనం, రాజబోయిన కమ్యూనిటీ భవనం, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సైన్స్ ల్యాబ్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను ప్రారంభించడంతో పాటు డైనింగ్ హాల్ నిర్మాణానికి, జడ్పీహెచ్ఎస్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, మాల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని రామాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా రూ.2016 పెన్షన్ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారన్నారు.
కొత్త పెన్షన్లు దసరా ముందు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నామన్నారు. నేడు నారాయణరావుపేట మండలంలో ఇప్పటికే 4,288 పెన్షన్లు ఉండగా, మరో 569 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామన్నారు. ఇంకా అర్హత ఉండి పింఛన్ పొందని వారిని గుర్తించి, త్వరలోనే వారికి కూడా అందిస్తామన్నారు. అర్హత ఉన్నవారు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలను సంప్రదించాలన్నారు.
సీఎం కేసీఆర్ ఇంటికి పెద్దకొడుకులా, కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రలో పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని, కానీ, మన రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా తెలంగాణలో ఉన్న మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఉన్నాయా?.. అని అడిగారు. డబుల్ ఇంజిన్.. డబుల్ ఇంజిన్.. అని చెప్పే బీజేపీ.. ట్రబుల్ ఇంజిన్‌గా మారిందని ఎద్దేవా చేశారు.
ఉచితాలు వద్దనే బీజేపీలో కేంద్ర ప్రభుత్వం.. బడా బాబులకు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నదన్నారు. గతంలో రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూసే వారని, కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత చెరువులు, కుంటలు నిండి ఎండాకాలంలో కూడా మత్తడి దూకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నాడు ఎంతో మంది సీఎంలు మారారని, కానీ, తెలంగాణకు చుక్క నీరు కూడా రాలేదని, సీఎంగా కేసీఆర్ అయిన తర్వాత నీటి కొరత లేకుండా పోయిందన్నారు.
త్వరలో గుండెజబ్బులకు ఉపయోగపడే క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. క్యాన్సర్ పేషెంట్ల కోసం రేడియోథెరపీ, కీమోథెరపీ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, జడ్పీటీసీ లక్ష్మీరాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ సంతోశ్, సర్పంచ్ మాస శశి యాదగిరి పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నామని, పేదలకు భారం కావద్దనే ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గంలోని 101 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆందజేశారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దవాఖానకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఉడుతా భక్తిగా సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రభు త్వ దవాఖానను అన్ని రకాలవైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లోనూ ఉచితంగా వైద్యం అందించేలా కృషి చేస్తాన్నారు.
సిద్దిపేట దవాఖానలో క్యాథ్ ల్యాబ్ త్వరలో అందుబాటులోకి తీసుకరానున్నట్లు మంత్రి తెలిపారు. పైసా ఖర్చు లేకుంగా ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకవచ్చామన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో కంటి సమస్యలు ఉన్న వృద్ధ్దులందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సిద్దిపేట పట్టణం సర్వతో ముఖాభివృద్ధ్దికి కృషి చేస్తున్నా .. ఆభివృద్ధ్దిలో సిద్దిపేట ఆదర్శంగా నిలపాలనని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డులో మైసమ్మ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లింగారెడ్డిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటను అన్ని రంగాల్లో అబివృద్ధి చేశామని, అన్నింటిలోనూ ఒక అడుగు ముందుంచామన్నారు. రాను న్న రోజుల్లో హైదరాబాద్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట అభివృద్ధిని, మార్కెట్‌ను దేశ నలుమూలల నుంచి వచ్చి సందర్శిస్తున్నారని, అక్కడ ఈ మార్కెట్ మాదిరిగా నిర్మించుకుంటున్నారన్నారు.
సిద్దిపేట నాలుగు దిక్కుల బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. మూడు నెలల్లో మైసమ్మ అలయాన్ని నిర్మించి, ప్రారంభించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజితా వేణుగోపాల్‌రెడ్డి , మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్లు, విజేందర్‌రెడ్డి, నాయకం లక్ష్మణ్, చంద్రం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గంప రాంచందర్‌రావు, నాయకులు పూజల వెంకటేశ్వరావు, సాకి ఆనంద్, ధరిపల్లి శ్రీనివాస్, పైసా రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరక్టర్లు పాల్గొన్నారు.