సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు25: అంతరిస్తున్న జాతులను కాపాడేందుకు సాంప్రదాయ వృత్తులను రక్షించాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ డిజైన్ కాన్సెప్ట్‌తో సాంప్రదాయ పచ్చబొట్టుతో జీవనం కొనసాగిస్తున్న తోటి జాతి మహిళలు, వారు ఆధారపడి జీవిస్తున్న గోండు గిరిజన జాతీయులపై పరిశోధన చేసినట్టు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మానవతా దృక్పథంతో సాంకేతికతలో ఆవిష్కరణలకు ఐఐటీహెచ్ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
ఆయా జాతుల సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించేందుకు వారిని ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదారాబాద్‌లో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పని చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతిక సహాయంతో గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఐఐటీహెచ్ గ్రామీణాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న తోటి కమ్యూనిటీ సాంప్రదాయ పద్ధతులను పరిశోధించడం, ఆయా పద్ధతులను సంరంక్షించడమే లక్ష్యంగా ప్రొఫెసర్ దీపక్ జాన్ మ్యాథ్యూ మార్గ దర్శకత్వంలోని పరిశోధనా బృందం నిమగ్నమైందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం తోషం గ్రామ పరిధిలోని తోటి గూడలో బృందం క్షేత్ర పర్యటన చేసిందని వివరించారు.
తోటి జాతీయుల సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి వారి పాటలు రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. తోటీలు రాజ్ గోండులతో అనుబంధంగా ఉండే గిరిజన సంఘం అని ఆయన వివరించారు. గోండ్వానా రాజ్యం చరిత్రను మౌఖిక చరిత్ర రూపంలో సజీవంగా ఉంచుతూ గోండు గాథ పాడడం తోటీల సాంప్రదాయ వృత్తిగా పేర్కొన్నారు.
గోండు పోషకులపై ఆధారపడి తోటీలు వారి జీవనోపాధిని కొనసాగించారని గుర్తు చేశారు. తోటి కమ్యూనిటీకి చెందిన మహిళలు సాంప్రదాయ పచ్చబొట్టు తయారీదారులని, వైద్యం, రోగ నివారణలో భాగంగా సాంప్రదాయ పచ్చబొట్టును ప్రదర్శిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి పద్ధతులు క్రమంగా తగ్గుతున్నాయని మూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.
కొన్ని కుటుంబాలు మాత్రమే ఇప్పటికీ తరతరాలుగా ఉన్న ఆచారాలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. 2021 జనాభ లెక్కల ప్రకారం 4811 మంది తోటీలు మాత్రమే ఉన్నారని, వారిని, వారి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.