సంగారెడ్డి, ఆగస్టు 25: బెదిరింపులకు తెలంగాణ బిడ్డలు భయపడరని, బీజేపీ శిఖండి రాజకీయాలు మానుకోవాలని జాగృతి జిల్లా నాయకుడు అరవిందరెడ్డి హెచ్చరించారు. గురువారం హద్రాబాద్కు తరలివెళ్లి జాగృతి రాష్ట్ర నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను కలిసి ఆయన సంఘీభావం ప్రకటించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అరవిందరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఘనత ఎమ్మెల్సీ సొంతమన్నారు. పోరాటాలు ఆమెకు కొత్త కదాన్నారు. తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని బీజేపీ గుర్తించాలని అన్నారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ప్రజా క్షేత్రంలో వాటిని తిప్పి కొట్టి, తగిన గుణపాఠం చెపుతామని జాగృతి రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల శివశంకర్ పాటిల్ అన్నారు. గురువారం హద్రాబాద్కు తరలివెల్లి జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం ప్రకటించి, మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో జాగృతి నాయకులు నవనీత్‌రెడ్డి, అభిలాశ్, భాను ప్రకాశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 25: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడి హేయమైన చర్య అని రాష్ట్ర జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డగా రాష్ట్రం కోసం కవిత పోరాటం చేశారన్నారు. కవిత ఇంటిపై రాళ్లు వేసిన బీజేపీ నాయకుల చర్య అప్రజాస్వామికమన్నారు. దౌర్జన్యలకు దిగేవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కవిత ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
– తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు మల్లిక