మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: “మంజీరా అంటే స్వచ్ఛతకు చిహ్నం.. మెదక్ బ్రాండ్ పేరిట స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల విక్రయానికి లోగో రూపకల్పన చేసి విక్రయాలకు నాంది పలకడం గర్వకారణం.” అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్లో డీఆర్డీవో ఆధ్వర్యంలో స్వ యం సహాయక సంఘాల ఉత్పత్తు ల ఆవిష్కరణను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను, విక్రయించనున్న ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 13వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు విస్తరాకుల తయారీ, కారం పొడి, బియ్యం పిండి, శనగ పిండి, పసుపు పొడి, పప్పులు, పాపడ్, పచ్చళ్ల తయారీ, డిటర్జెంట్ పొడి ఇలా సుమారు 40 రకాల ఉత్పత్తులు చేస్తున్నారన్నారు.
వాటిని మంజీరా బ్రాండ్ పేరిట విక్రయించడానికి తమవంతు సహకారాలు అందిస్తానన్నారు. నూతన కలెక్టరేట్, పోలీస్ హెడ్క్వార్టర్స్నందు ఉచితంగా స్టాల్స్ ఏర్పాటుతో పాటు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా రెండు స్టాళ్లు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ ఉత్పత్తుల విక్రయానికి ప్రధాన రోడ్డు సమీపంలో స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. ఆ స్థలంలో భవన నిర్మాణానికి రూ.50 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉత్పత్తులను హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్లలో విక్రయానికి టైఅప్ చేయాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఆన్లైన్లో వెబ్సైట్ ఏర్పా టు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
డీసీసీబీ ద్వారా 5 శాతానికి రుణాలు అందించేలా ప్రయ త్నం చేస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సా ధారణ ప్రసవాలు జరిగేలా మహిళలను ప్రోత్సహించాలని మహిళా సంఘాలకు సూచించారు. ఈ సందర్భంగా మంజీరా లోగో, కరపత్రాన్ని, గోడ పత్రికను ఆవిష్కరించారు. రూ.60 కోట్ల 78 లక్షల బ్యాంక్ లింకేజీ చెక్కు, రూ.4 కోట్ల 26 లక్షల స్త్రీనిధి చెక్కులను స్వయం సహాయక సంఘాలకు మంత్రి అందజేశారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇప్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.