సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 24 : జిల్లాలో ‘మనఊరు-మనబడి’ పనులను వేగంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ‘మనఊరు-మనబడి-మనబస్తీ’ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీ వారీగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులు, ఇంకా ప్రారంభం కాని పనులు, టెండర్ ప్రక్రియలో ఉన్న పనులు, జాప్యానికి గల కారణాలు తదితర అంశాలను ఏజెన్సీ నిర్వాహకులు, విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మనఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. ఆయా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పురోగతిలో ఉన్న పనులు వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలన్నారు. టెండర్ స్టేజీలో ఉన్న పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. మనఊరు-మనబడి పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసిన సంబంధిత ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ అభినందించారు. ఆయా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని డీఈవో రాజేశ్‌ను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని హితవు పలికారు. వచ్చే వారంలోగా అన్ని పనులకు సంబంధించిన పురోగతి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
బ్యాంక్ లింకేజీలో జిల్లాకు మొదటి స్థానం
సంగారెడ్డి నియోజకవర్గస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ సమీక్షిస్తూ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి బ్యాంకు లింకేజీలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నదని సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్యానికి మించి పురోగతి సాధించిన సంగారెడ్డి మండల ఏపీఎం వెంకట్, మండల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్, డీపీవో సురేశ్ మోహన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, టీఎస్ఈడబ్ల్యూ, ఐడీసీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.