పేదలే తమ ఆత్మబంధువులని, వారు ఆత్మగౌరవంగా బతకాలని ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉచితంగా ఇస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్ సమీపంలో నిర్మించిన 1075 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. 575 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.60వేలు ఇచ్చేవారని, ఆ డబ్బులు చెప్పులరిగేలా తిరిగితే గాని వచ్చేవి కావన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, బీజేపీ సర్కారు పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నదన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మెదక్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): డప్పు చప్పుళ్లు.. బ్యాండ్‌మేళాలు.. బోనాల ఊరేగింపు.. బతుకమ్మల ఆటలు.. పటాకుల మో తలు.. ఇలా మెదక్ జిల్లాకేంద్రంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మెదక్ పట్టణంలో 1075 డబుల్ బెడ్రూం ఇం డ్లను నిర్మించామని, బుధవారం 575 మందికి ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. వీరందరూ సామూహిక గృహ ప్రవేశాలు చేశారన్నారు. మరో 500 ఇండ్లను త్వరలో అర్హులకు కేటాయిస్తామని చెప్పారు.
గతంలో కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.60వేలు ఇచ్చేవారని, అందులో రూ.40వేల అప్పు, రూ.20 వేలు సబ్సిడీ ఉండేదని గుర్తుచేశారు. అవి కూడా మూడు కిస్తీ ల్లో బ్యాంక్ వారు ఇస్తే అందులో నుంచి మధ్యవర్తులను పట్టుకుంటే పైసలు ఇచ్చేవారన్నారు. కానీ, పైసా ఖర్చు లేకుండా..చెమట చుక్క చిందకుండా.. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వమే భరించి పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. ఇలాం టి పథకం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పేదలకు ఉచితంగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇండ్లు రాలేదని, ఆ పార్టీ నాయకులే బలపడ్డారని గుర్తు చేశారు. సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తామని మంత్రి ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పనిచేయరని, కానీ.. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, అధికారులు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
మాకు డబుల్ బెడ్రూం ఇల్లు రావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ దయతో మాఇంటి బెంగ తీరింది. ఇల్లు లేక ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డాం. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినందుకు మంత్రి హరీశ్‌రావు సారు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు. మాలాంటి పేదల పాలిట దేవుడు కేసీఆర్ సార్.
– దివ్య, లబ్ధిదారు,మెదక్
పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం ఆలోచన..
గతంలో కాంగ్రెస్ హయాంలో రూ. 200 పింఛన్ ఇస్తే, ఇప్పుడు సీఎం రూ. 2016 పింఛన్, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ పింఛన్లు పెంచి అందజేస్తున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 1,00,600 పిం ఛన్లు ఉన్నాయని, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కొత్తగా జిల్లాకు 21వేల పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో వారందరికీ పిం ఛన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వినతి మేరకు మెదక్ పట్టణ శివారులో ఎంసీహెచ్ దవాఖాన నిర్మించినట్లు తెలిపారు. రూపా యి ఖర్చు లేకుండా గర్భిణులు నార్మల్ డెలివరీలు చేస్తూ, వారికి కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారని, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. బీజేపీ ఉచితాలు బంద్ చేయమంటున్నదని, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తే ఆ పార్టీ ఓర్వడం లేదని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంటు బంద్ చేయాలా, రైతుబంధు పథకాన్ని రద్దు చేయాలా.. ఉచితాలు బంద్ చేయాలా… రద్దు చేయుమన్న బీజేపీనే రద్దు చేయాలని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతున్నదని ఆరోపించారు.
నిధులు, మెడికల్ కళాశాలలు, నవోదయలు, ఐఐఎంల మంజూరులో తెలంగాణపై బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, కొత్తగా మరో 90వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదని తెలిపారు. గ్యాస్,పెట్రో, డీజిల్ ధరలు పెంచి సామాన్యులు, పేదల బతుకు భారం చేసిన బీజేపీని నిలదీయాలన్నారు. బాయిలకాడ మీట ర్లు పెట్టేందుకు సిద్ధమైందని, ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
నెరవేరిన పేదల కల
మెదక్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల కల నెరవేరింది. గత ప్రభుత్వాల హయాంలో పైరవీలు చేస్తేనే ఇండ్లు వచ్చేవి. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఇతర రాష్ర్టాలు మన పథకాలు కాపీ కొడుతున్నాయి. మెదక్ పట్టణంలో రూపురేఖలు మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ
మీకు సేవ చేసే భాగ్యం కలిగింది
మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు సేవ చేసే భాగ్యం కలిగింది. మెదక్ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. మెదక్ పట్టణానికి సీఎం కేసీఆర్ వెయ్యి ఇండ్లు మంజూరు చేశారని, అందులో 561 ఇం డ్లను ప్రారంభించి గృహ ప్రవేశాలు చేయిం చాం. దసరాలోపు మరో 500 ఇండ్లను ప్రారంభిస్తాం. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో అసంపూర్తిగా ఉన్న పనులను నెలరోజుల్లో పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది మెదక్‌లో మెడికల్ కళాశాల మంజూరవుతుందని, పేదల కండ్లల్లో సంతోషమే నాకు ఎంతో తృప్తినిచ్చింది. డబుల్ బెడ్రూం ఇండ్లు రానివారు నిరాశ పడొద్దని, సొంత జాగ ఉంటే రూ.3 లక్షలు మంజూరు చేయిస్తా. డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
-పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
తెలంగాణ ప్రభుత్వం మా కుటుంబానికి డబుల్ బెడ్రూం మంజూరు చేసి పట్టా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. డబుల్ బెడ్రూం రావడంతో మాకు అద్దె ఇంట్లో ఉండే బాధ తప్పింది. కిరాయి కష్టాలు తీరాయి. మాలాంటి పేదోళ్లకు ఇల్లు ఇప్పించిన సీఎం కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
-రమాదేవి, లబ్ధిదారు, మెదక్
మాజీవితాల్లో వెలుగులు..
సీఎం కేసీఆర్ సార్ మా జీవితంలో వెలుగు నింపారు. మాకు డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం. మాకు ఇంటి కష్టాలు తీరాయి.
-జోత్స్న, లబ్ధిదారు, మెదక్