కొల్చారం, ఆగస్టు 24 : దంపతుల హత్య మండలంలోని పైతరలో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నిమ్మన్నగారి లక్ష్మారెడ్డి (55), నిమ్మన్నగారి లక్ష్మి (50) అనే దంపతులు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యా రు. పోలీసుల వివరాల ప్రకారం.. దుండగులు కరెంట్ వైర్లు కత్తిరించి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో బీరువా పగులగొట్టి పెద్దమొత్తంలో నగదు, నగలు దోచుకెళ్లడంతోపాటు సామాన్లు చిందర వందరగా పడేశారు. మొదటగా లక్ష్మారెడ్డి భార్య లక్ష్మిని పదునైన ఆయుధాలతో పడుకున్న బెడ్‌పైనే తలపై బాది చంపేశారు. తర్వాత లక్ష్మారెడ్డిని వారి ఇంటికి యాభై మీటర్ల దూరంలో ఉన్న గూడెం రామిరెడ్డికి చెందిన పశువుల పాకలో అతి కిరాతకంగా కత్తిపోట్లు చేయగా, రక్తం మడుగులు కట్టింది.
గోనె సంచులతో రక్తాన్ని తుడిచి మృతదేహాన్ని పశువుల పాకలోనే ఉన్న గదిలో పడేశారు. తెల్లవారుజామున విషయం మండల వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. గ్రామస్తులంతా పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని ఈ ఘటనకు కారకులైన నిందితులను తమకు అప్పగించాలని గొడవ చేయడంతో పైతరలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ విజయ్, కొల్చారం ఏఎస్సై తారాసింగ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పైతర గ్రామానికి వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పొలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్ రప్పించి పరిశోధన ప్రారంభించారు. డాగ్‌స్కాడ్ హత్య జరిగిన రెండు ప్రదేశాల వద్దకు తిరిగి ప్రధాన రహదారి వైపునకు చేరుకుంది. లక్ష్మారెడ్డిని హత్యచేసిన కొద్ది దూరంలో ఉన్న బావిలో రక్తపు మరకలతో కూడిన గోనెసంచి లభించింది.
నిందితులను వదలం : మెదక్ డీఎస్పీ సైదులు
దంపతుల హత్య ఉదంతంపై డీఎస్పీ సైదులు విలేకరులతో మాట్లాడుతూ ఇంట్లో ఉన్న బీరువా, పెట్టెను పగులగొట్టి అందులో భారీ మొత్తంలో నగదు, నగలు దోచుకుని వెళ్లారన్నారు. ఈ సమయంలోనే మొదట లక్ష్మారెడ్డి భార్య లక్ష్మిని హత్య చేశారని, ఇది చూసిన లక్ష్మారెడ్డి తమను గుర్తుపట్టాడన్న తలంపుతోనే దుండగులు అతడిపై దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీయగా, వెంబడించి హత్యచేసి ఉండవచ్చన్నారు. హత్య ఉదంతం తెల్లవారుజామున జరిగినట్లు అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తున్నదన్నారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో పాటు లక్ష్మారెడ్డి కూతురు తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదన్నారు.
మృతదేహాలపై తరలింపుపై గ్రామస్తుల ఆందోళన..
భార్యాభర్తల మృతదేహాలను తరలించాలన్న క్రమంలో గ్రామస్తులు పోలీసులతో గొడవకు దిగారు. నిందితులను పట్టుకునే వరకు శవాలను తరలించనీయమని అడ్డుకున్నారు. ఓ దశలో ఎస్పీ వాహనాన్ని సైతం అడ్డగించి ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో భారీగా పొలీసులను మోహరించారు. పోలీసులు సాయం త్రం వరకు గ్రామస్తులకు నచ్చజెప్పి, లక్ష్మారెడ్డి దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ దవాఖానకు తరలించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొల్చారం ఏఎస్సై తారాసింగ్ తెలిపారు. కాగా, తమ తల్లిదండ్రులను పక్కింటి వ్యక్తే హత్య చేశాడని, మృతుల దంపతుల కూతురు కవిత ఆరోపించారు. తరుచూ తన తల్లిదండ్రులతో పొలం గట్ల విషయంలో గొడవ పడేవారని, పలుమార్లు చంపుతానని బెదిరించినట్లు ఆమె తెలిపారు. లక్ష్మారెడ్డి, లక్ష్మి దంపతులకు కూతురు కవిత ఉండగా, ఆమెను సంగాయిపేట వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశారు.