మెదక్ అర్బన్, ఆగస్టు 23 : కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియమావళి మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరిటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 28న నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 8821 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో 28 సెంటర్లు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో 17, నర్సాపూర్‌లో 5 పరీక్షా కేంద్రాలు, రామాయంపేటలో 4, చేగుంటలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించన్నుట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. అభ్యర్థులు గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు గంటముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. అభ్యర్థులు చేతులకు గోరింటాకు, మెహందీ పెట్టుకోవద్దన్నారు. దీంతో బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. పరీక్ష పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు. మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోనికి అభ్యర్థులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. పరీక్ష రీజినల్ కో-ఆర్డినేటర్ మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి, నోడల్ ఆఫీసర్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, పోలీస్ బయోమెట్రిక్ అధికారి రవీందర్, సీఐ డీసీబీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ పాల్గొన్నారు.