సిద్దిపేట, ఆగస్టు 23 : రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కేంద్రం చేసేది నల్ల చట్టాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ తీరు సామాన్యులను ఇబ్బందులు పెట్టేలా ఉన్నదని, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించేలా చూస్తున్న కేంద్రం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. మంగళవారం జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం డబ్బులు మంజూరు చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంపై అనేక ఆంక్షలు పెట్టి ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలిగించే విధంగా కేంద్రం కొత్త జీవో తెచ్చిందన్నారు. బడా వ్యాపారులపైన ఉన్న ప్రేమ ఉపాధి హామీ పథకం కూలీల మీద లేదని, ఉపాధి హామీలో 10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ఇది సాక్షాత్తు కేంద్రమంతి చెప్పిన మాట అంటూ విమర్శించారు.
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న తప్పులు చూపుతూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని, ఈజీఎస్ పట్ల కేంద్రం మొండిగా ఉన్నదన్నారు. రైతు వేదిక, ధాన్యం కొనుగోలు కోసం కట్టిన ధాన్యం కల్లాల గురించి తప్పులుగా చూపే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. రైతు పంట కొనడంలో కొర్రీలు పెట్టి కేంద్రం బాధ్యత నుంచి తప్పుకున్నదని, అయినప్పటికీ రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ ధాన్యం మొత్తం కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆసిటెంట్ల సంఘం నాయకుడు అమర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
కేంద్రం తీరుపై మంత్రి ఆగ్రహం
సిద్దిపేట, ఆగస్టు 23 : తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ చెబుతున్నదని, ఉచితాలు రద్దు కాదు బీజేపీని మనం రద్దు చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి 218 మంది బీడీ కార్మికులకు పింఛన్ మంజూ రు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల గురించి ఆలోచించిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణలో నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. బీడీ పరిశ్రమ మీద కూడా కేంద్రం ఆంక్షలు విధించిందన్నారు. బీడీ కార్మికులకు కేంద్రం అన్ని సంక్షేమ పథకాలు తొలిగించి, కష్టం చేసుకునే బీడీ పరిశ్రమ మీద కేంద్రం కక్షకట్టిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేద్దామని, కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, శ్రీదేవి చందర్రావు, ఓగ్గు బాలమల్లు యాదవ్, సర్పంచులు పాల్గొన్నారు.