తూప్రాన్, ఆగస్టు22: తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో నిర్మించిన సమీకృత మోడల్ మార్కెట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రూ.10.30 కోట్లతో మూడంతస్తుల్లో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మోడల్ మార్కెట్‌ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో మొత్తం 102 స్టాళ్లు ఏర్పాటుచేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ స్టాళ్లతో పాటు కమర్షియల్ షాపులకు షట్టర్లు ఏర్పాటుచేశారు. ఫస్ట్‌ఫ్లోర్‌లో చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లు, సెకండ్ ఫ్లోర్లో సూపర్ మార్కెట్, రెస్టారెంట్, బ్యాంకింగ్ తదితర సేవలకు వ్యాపార దృక్పథంతో స్థలాలు కేటాయించనున్నారు.
ఈ మార్కెట్లో ఎన్నో ప్రత్యేకతలు
సమీకృత మోడల్ మార్కెట్లో 24 గంటలు మినరల్ వాటర్ సౌకర్యం, లిఫ్టు, నిరంతరంగా సీసీ కెమెరాల నిఘా, రిమోట్ కంట్రోల్‌తో పని చేసే మెయిన్ షట్టర్, ప్రతి అంతస్తుకూ ప్రత్యేక టాయిలెట్లు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉన్నాయి. తూప్రాన్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలకు సెంటర్ పాయింట్‌గా ఉండేలా నర్సాపూర్ చౌరస్తాలో సమీకృత మోడల్ మార్కెట్‌ను నిర్మించారు. అన్ని వసతులతో నిర్మించిన ఈ మోడల్ మార్కెట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ మార్కెట్‌ను మంత్రి హరీశ్‌రావుతో ప్రారంభించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అటు స్టాళ్లు నిర్వహించుకునే వ్యాపారులు, ఇటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.