తూప్రాన్, ఆగస్టు 19: గ్రామ కంఠం భూ యాజమాన్య హక్కులపై మండల పరిధిలోని యావాపూర్ ఎన్నిక అయ్యింది. దీంతో శుక్రవారం అధికారులు గ్రామ కంఠం భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎంవో ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై, క్షేత్రస్థాయిలో పర్యటించారు. ర్యాండమ్ విజిట్ చేస్తూ గ్రామానికి చెందిన పిట్ల యాదయ్య, అవుసుల నరేందర్ ఇండ్లకు వెళ్లారు. వారు నిర్మించుకున్న ఇంటి విస్తీర్ణం, ఖాళీ స్థలాలను గూర్చి ఆరా తీశారు. నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి పన్ను రసీదు ఉంటుంది, మరి ఖాళీ స్థలాలు మీవే అని ఎలా ధ్రువీకరించుకుంటారు? అని వారిని ప్రశ్నించారు. తమకు ఎలాంటి ఆధారాలు లేవని, తమ తాతలు, తండ్రుల ద్వారా భూములు సంక్రమించినట్లు ఒకరు తెలుపగా, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశామని మరొకరు తెలిపారు. దీంతో గ్రామ కంఠం భూములకు సంబంధించి ప్రభుత్వం ద్వారా ఏదైనా యాజమాన్య ధ్రువీకరణ ప్రతం ఉంటే బాగుంటుందా అని అడగగా, బాగుంటుందని సమాధానమిచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్మితా సబర్వాల్ గ్రామస్తులనుద్ధేశించి మాట్లాడుతూ గ్రామ కంఠం భూములకు సంబంధిం ఏమైనా సమస్యలుంటే అభిప్రాయాలు చెప్పాలన్నారు.
దీంతో సర్వే నెంబర్ ఉండి, నాలా కన్వర్షన్ అయిన భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, అందులో నిర్మించుకున్న ఇండ్లకు అనుమతులు సులభంగా వస్తున్నాయని, గ్రామ కంఠం భూములు రిజిస్ట్రేషన్ అవడం లేదని, గ్రామ కంఠం భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు పర్మీషన్లు రావడం కూడా చాలా కష్టమవుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు గ్రామ కంఠంలోని ఖాళీ స్థలాలకు పన్ను విధించడం లేదని, తక్కువ పన్నుతో యాజమాన్య ధ్రువీకరణ అందిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పొలాలకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకంలాంటి పాస్ పుస్తకం లాంటిది ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారా అని గ్రామస్తులను అడగగా, బాగుంటుందని గ్రామస్తులంతా సమాధానమిచ్చారు.
దీంతో కల్పించుకున్న స్మితా సబర్వాల్ యావాపూర్ గ్రామ కంఠం మొత్తం 17 ఎకరాల్లో విస్తరించి ఉందని, గ్రామస్తులంతా ఒప్పుకుంటే డ్రోన్ ద్వారా సర్వే చేయించి గ్రామస్తులందరి ఇండ్లు, ఇండ్ల స్థలాలకు ప్రత్యేక గుర్తింపు పుస్తకాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో వెంకటశైలేష్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, డీఎల్పీవో శ్రీనివాస రావు, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీవో అరుంధతి, ఆర్ఐ నగేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.