
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 28 : జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ అన్నారు. శుక్రవారం చంద్రాగౌడ్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ సాదరణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు పక్కన గల 38 గుంటల ప్రభుత్వ స్థలాన్ని జిల్లా గ్రంథాలయానికి భవనానికి కేటాయించామన్నారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే గ్రంథాలయ భవనాన్ని సర్వాంగసుందరంగా నిర్మిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తామన్నారు. నర్సాపూర్‌లో రూ. కోటితో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనం తుది దశకు చేరుకుందన్నారు. రేగోడ్‌లో రూ.25 లక్షలతో గ్రంథాలయ నిర్మాణానికి కోల్‌కత్తాలోని రాజారామ్ మోహన్‌రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్‌కు ప్రతిపాదనలు పంపామని వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ నుంచి పోటీ పరీక్షలతోపాటు మహిళలు, పిల్లల సాహిత్యం తదితర అంశాలకు సంబంధించిన 585 పుస్తకాలు జిల్లాకు వచ్చాయన్నారు. ఈ పుస్తకాలను జిల్లాలోని 15 శాఖ గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామన్నారు. పుస్తక ప్రియులకు గ్రంథాలయాల్లో మంచి సాహిత్య పుస్తకాలతోపాటు విద్యార్థుల పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పుస్తక ప్రియులు గ్రాంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో వయోజన విద్య ఉపసంచాలకుడు రామేశ్వర్, డీపీఆర్వో శాంతికుమార్, డైరెక్టర్లు సిద్ధిరాములు, అనూష, విజయలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.