మెదక్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి మెదక్ జిల్లా మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బొచ్చె, రాహు, బంగారుతీగ తదితర రకాల మొత్తం 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో వదిలేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, నేటి నుంచి అర్హులైన కంపెనీలతో అగ్రిమెంట్లు చేయనున్నారు. అనంతరం పంపిణీని చేపట్టి 30 నుంచి 40 రోజుల్లోగా జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపవిత్తనాలు విడిచిపెట్టేలా చర్యలు తీసుకోనున్నారు. మహిళా సంఘాలతో కలుపుకొని మొత్తం 263 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, దాదాపు 15,724 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు అధికారులు సంసిద్ధమవుతున్నారు. మెదక్ మత్స్య శాఖ కార్యాలయంలో చేపపిల్లల కృత్రిమ ఉత్పత్తి చేస్తున్నారు. అదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
జిల్లాలో మత్స్య సహకార సంఘాలకు చేపపిల్లలు పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా వేలాది మంది మత్య్సకారులకు ఆగస్టు రెండోవారంలో చేపవిత్తనాల పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నెల రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గుర్తించిన చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉచితంగా చేపపిల్లలు వదిలేందుకు జిల్లా మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. అంతేకాకుండా, చేప పిల్లల సరఫరా కోసం ఇప్పటికే టెండర్లను పూర్తి చేయగా, త్వరలోనే అగ్రిమెంట్ల ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నది. చెరువుల్లో చేపపిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కాగా, దీంతో ఎంతోమంది మత్య్సకారులకు మేలు జరుగనున్నది. ఈ వానకాలంలో వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు నిండుకుండల్లా మారాయి.
మత్స్యకారులకు చేయూత…
మత్స్యకారులకు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలను ఉచితంగా వదులుతున్నది. వదిలిన నాటి నుంచి ఆరు నెలల తర్వాత పెరిగిన చేపలను పట్టి అమ్ముకోవడం ద్వారా మత్య్సకారులు ఆర్థికంగా లబ్ధి పొందనున్నారు. జిల్లాలో మహిళా సంఘాలతో కలుపుకొని మొత్తం 263 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15,724 మంది మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వందశాతం రాయితీతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి అనుగుణంగా ఉచితంగా చేప పిల్లలను వదలడం ద్వారా వీరందరికీ ఉపాధి లభించనున్నది. కాగా, ఇందుకోసం టెండర్లను దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హులను ఎంపిక చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలో పశు సంవర్ధక, మత్స్య, సహకార శాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు.
మొత్తం 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు…
జిల్లాలో 1614 చెరువులు, కుంటలు, పోచారం, ఘణపూర్ ప్రాజెక్టుల్లో ఈ సారి బొచ్చె, రాహు, బంగారుతీగతో పాటు వివిధ రకాలకు చెందిన 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలను వదలనున్నారు. ఆగస్టు రెండో వారం తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుండగా, మొత్తం 30 నుంచి 40 రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువుల్లో చేప ప్లిలలను వదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా మెదక్ మత్స్యశాఖ కార్యాలయంలో చేప పిల్లల కృత్రిమ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీడ్‌ను స్థానిక చెరువుల్లో వదలడమే కాకుండా అదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
పూర్తయిన టెండర్ల ప్రక్రియ…అగ్రిమెంట్ల ప్రక్రియ షురూ…
జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో 5 కోట్లకు పైగా చేప పిల్లలను వదలనుండడంతో ఇప్పటికే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను పిలువగా, పలు సీడ్ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. జూలైలో టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి కంపెనీల అర్హతను పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ కంపెనీలను పిలిచి చివరగా ఏ ధరకు ఇస్తారో ఫైనల్ చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో నేటి నుంచి నుంచి అగ్రిమెంట్ల ప్రక్రియ ప్రారం భం కానున్నది.