సంగారెడ్డి, ఆగస్టు 7: చేనేత వృత్తి కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఉన్న వారినే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఎంపికచేస్తారని, ప్రతి శుక్రవారం తప్పకుండా చేనేత దుస్తులు ధరించాలని అన్నారు. చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు రంగులు, నూలును ప్రభుత్వం సబ్సిడీ పై అందజేస్తున్నదని తెలిపారు. అంతకుముందు ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని కలెక్టర్ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. సదాశివపేటలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మెదక్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ వేడుకల్లో పాల్గొన్నారు.
చేనేత కార్మికులు (కళాకారులు) మర మగ్గాలపై వివిధ ఆకృతులతో బట్టలు నేస్తూ చేనేత రంగానికి కొత్త హంగులు తెస్తున్నారని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ శరత్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలను చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వళను చేసి చేనేత జాతీయ దినోత్సవ వేడుకలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ప్రతివారం చేనేత దుస్తులు ధరిస్తామని అధికారులు, కళకారులు,ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా 2021-2022 మిసెస్ ఇండియా సుహాసిని విచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా చేనేత దుస్తులు ధరించి హాజరయ్యారు. చేనేత దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు పురస్కారాలను అదనపు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వృత్తే ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళకారులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ముఖ్యంగా మగ్గాలకు జియోట్యాగింగ్ చేసుకొని వారు ఉంటే వెంటనే జియోట్యాగింగ్ చేసుకోవాలన్నారు. జియోట్యాగింగ్ ఉన్నవారికి ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులుగా ఎంపికవుతారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ స్వదేశీ ఉద్యమం తీసుకువచ్చి దేశంలో నేసిన దుస్తులను వాడాలని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేనేత కళకారుల ఆరాధ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు రంగులు, నూలును సబ్సిడీపై అందజేస్తుందన్నారు. చేనేత కళకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు.