పటాన్చెరు, ఆగస్టు 7 : దేశంలోనే తెలంగాణ పారిశ్రామిక విధానం గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో స్వాన్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రెండో ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నదన్నారు. ఒకప్పుడు వారంలో మూడు రోజుల విద్యుత్ కోతను ఎదుర్కొన్న పారిశ్రామికవాడల్లో తెలంగాణ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ఉత్తమ విద్యుత్ పాలసీతో 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. దీంతో పరిశ్రమల్లో మూడు షిప్టులు నడుస్తున్నాయన్నారు.
కార్మికులకు కూడా ఓటీలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు వస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతున్నదని, నిరుద్యోగ యువతకు భారీగా అవకాశాలు వస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదన్నారు. స్వాన్ టర్బైన్ పరిశ్రమ రెండో ప్లాంట్ ఏర్పాటుతో స్థానికంగా 3 వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా మరికొందరికి ఉపాధి దొరుకుందని తెలిపారు. మన దేశంతో పాటు ఆఫ్రికన్, మధ్య ప్రాశ్చ దేశాల్లో స్వాన్ టర్బైన్ పరిశ్రమకు మంచి పేరుందని కొనియాడారు. పరిశ్రమ యాజమాన్యానికి తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు దేశానికి ఎక్కువ జీడీపీ అందజేస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలుస్తున్నదన్నారు. స్వాన్ టర్బైన్ ఎండీ పీ సత్యనారాయణ మాట్లాడుతూ, మంత్రి హరీశ్‌రావు తమ రెండో ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతికత, ఇంజినీరింగ్ సామ ర్థ్యం, నాణ్యతకు తాము పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.