ఝరాసంగం, ఆగస్టు 3: కూలీల కొరతతో పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు విత్తిన నాటి నుంచి కలుపు తీత, అడుగు మందులు వేయడం, పంటకు వ్యాపించే చీడపీడల నివారణకు మందుల పిచికారీ వంటి పనులు చేసేందుకు కూలీలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకుంటున్నారు. ఎకరం పత్తి పంటలో మందు లు వేసేందుకు రూ.900 నుంచి రూ.1200 వరకు ఖర్చు వస్తున్నది.
కలుపు తీసేందుకు రూ.2500 నుంచి రూ. 3వేల వరకు ఖర్చు రావడంతో రైతులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో మండలంలోని సిద్దాపూర్కు రైతు సంజీవరెడ్డి సొంత ఆలోచనతో తక్కువ ఖర్చు తో వ్యవసాయ పరికరం తయారు చేశాడు. ప్రస్తుతం ఝరాసంగం సొసైటీ వైస్చెర్మన్గా కొనసాగుతున్నాడు. కొత్త పరికరంతో ఎంతో మేలంటూ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆ యంత్రాన్ని తీసుకువెళ్లి పత్తి పంట కు అడుగు మందులు వేసుకుంటున్నారు. కొత్త వ్యవసాయ పరికరం తయారీపై ప్రత్యేక కథనం..
తక్కువ ఖర్చుతో తయారు..
యంత్రానికి వాడిన పరికరాలు రెండు అంగుళాల పైపు మూడు ఫీట్లు, రెడ్సార్, అంగుళం ఎంటీఏ, ఒక అంగుళం పైపు రెండు ఇంచుల పైపు ముక్క, ఒక అంగుళంపై అర అంగుళం బూసు, అర అంగుళం పైపు, ఒక ఫీట్ క్యాప్ (మూత), సైకిల్ మోటర్ ట్యూబు రెండు ఫీట్లు, ఒక క్లాప్, రెండు ఇంచుల ఒక స్క్రూతో యంత్రం తయారు చేశాడు. దీని ఖర్చు మొత్తం రూ. 385 అయింది.
ఖర్చు తక్కువ .. ఆదాయం ఎక్కువ
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పెంచుకోవచ్చు, పైగా కూలీల కొరత లేకుండా పంటలు సాగు చేసుకోవచ్చు ఈ పరికరంతో ఒక కూలీ అవసరం ఉంటుంది. అందుకు రైతులందరూ సొంత ఆలోచనలు ఉపయోగించి పాడైన వస్తువులతో చిన్నచిన్న యంత్రాలు తయారు చేసుకున్నైట్లెతే పంటల సాగుకు తక్కువ ఖర్చవుతుంది.
– సంజీవరెడ్డి, రైతు, గ్రామం సిద్దాపూర్